Husband of harassment
-
సెల్ఫోన్లో మాట్లాడరాదు.. ఫేస్బుక్ చూడరాదు
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య తన చావుకు భర్తే కారణమంటూ సూసైడ్ నోట్ మైసూరు: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం నరగంలోని భైరవేశ్వర నగర్లో జరిగింది. పోలీసుల కథనం మేరకు..పిరియా పట్టణ తాలూకా మల్లహళ్లి గ్రామానికి చెందిన కావ్య(26)కు మూడు సంవత్సరాల క్రితం నగరానికి చెందిన ప్రసాద్‌తో వివాహమైంది. నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న ప్రసాద్.. వివాహమైన ఏడాదినుంచి భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఎవరితోనూ మాట్లాడరాదని, ఫేస్బుక్ చూడకూడదని, ఫోన్లో కూడా ఎవరితోనూ మాట్లాడకూడదంటూ చిత్రహింసలకు గురి చేసేవాడు.భర్త ప్రవర్తనతో జీవితంపై విరక్తి చెందిన కావ్య శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు భర్త అనుమానపు వేధింపులే కారణమంటూ మృతురాలు రాసిన సూసైడ్‌నోట్ పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రసాద్ సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురి చేస్తున్నాడని కుమార్తె తమ వద్ద విలపించేదని తల్లిదండ్రులు పోలీసుల వద్ద వాపోయారు. తన కుమార్తె మృతి కారణమైన ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పెళ్లైన పద్నాలుగు నెలలకే..
► చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న వివాహిత ► భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి తండ్రి అనంతపురం న్యూసిటీ: అనంతపురం పాతూరుకు చెందిన బంగారు వ్యాపారి కదిరి మోహనాచారి ముగ్గురు కూతుర్లు. పెద్ద కుమార్తె యశోవాణి(26) అదనపు కట్నం కోసం భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. 2014 డిసెంబర్ 12న గోరంట్ల మండలం కొండాపురానికి చెందిన జీబీ ప్రసాద్ ఆచారి(ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం) కుమారుడు నరేశ్‌తో యశోవాణి పెళ్లైంది. అప్పట్లో కట్నం కింద రూ.6 లక్షలు, బంగారు కట్టబెట్టారు. పెళ్లైన రెండు నెలల నుంచే యశోవాణికి అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు అధికమయ్యాయి. ఈ విషయంపై కొన్నిసార్లు గొడవపడ్డారు. నేను కావాలా, కట్నం కావాల అంటూ యశోవాణి నిలదీసినా నరేశ్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇక భరించలేకపోయిన ఆమె తన గోడును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. ఏడ్చింది. వారు అల్లుడికి సర్ది చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓసారి యశోవాణి తీవ్ర అనారోగ్యానికి గురైనా భర్త పట్టించుకోలేదు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆపరేషన్ చేయించాడు. అయినా నరేశ్‌లో ఎటువం టి మార్పు రాలే దు. పోలీసులకు ఫిర్యాదు చేసినా... : భర్త వేధింపులపై యశోవాణి 2015 నవంబర్ 28న అనంతపురం మహిళ పోలీసు స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో భర్త, అత్తమామలు, ఆడపడుచు తనను ఏ విధంగా రాచి రంపాన పెట్టారో వివరించారు. అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్ బాషా కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా జరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ తరువాత నరేశ్ యశోవాణికి మాయమాటలు చెప్పి కాపురానికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి పుట్టింటికి పంపనే లేదు. నరేశ్ తండ్రి సైతం కోడలిని బాధించేవాడు. ఉగాది పండుగ కు ఇంటికెళ్తానని చెప్పినా పంపలేదు. దీంతో చివరకు ఈ నెల 6న చెన్నైలో ఆ అభాగ్యురాలు ఉరేసుకుని తనువు చాలించింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చి తిరిగి చూసిన భర్త నరేశ్ భార్య చనిపోయిందన్న సమాచారం పోలీసులు, వారి తల్లిదండ్రులకు తెలిపాడు. యశోవాణి మృతదేహాన్ని ఆదివారం రాత్రి అనంతపురానికి తీసుకువచ్చారు. -
ఆమెది ఆత్మహత్య కాదు.. హత్యే
► టాకీ గూడ గ్రామస్తుల పిర్యాధు ► సోమవారం తోషంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వివాహిత ► పోస్టుమార్టం రిపోర్టు తర్వాతే నిర్ధారణ : పోలీసులు గుడిహత్నూర్ : మండలంలోని తోషం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన మండలంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..మండలంలోని తోషం గ్రామానికి చెందిన శివాజీ బోంమ్డేకు 15 సంవత్సరాల క్రితం టాకీగూడ గ్రామానికి చెందిన శైలు (40)తో వివాహం జరిగింది. కట్న కానుకలతోపాటు సంప్రదాయబద్ధంగా వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు అమూల్, కుమార్తె తనూజ. ఆదిలాబాద్‌లో 8వ తరగతి చదువుకుంటున్నారు. కాగా సోమవారం శైలు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త శివాజీని అదుపులోకి తీసుకున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి శైలు భర్త వేధింపులు భరిస్తూ వస్తోందని టాకీగూడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ మూడీగా ఉండే శివాజీ సోమవారం సుమారు 4 గంటల ప్రాంతంలో శైలుతో గొడవ పడ్డాడు. అప్పటికే ఇంట్లో ఉన్న కుమారుడు అమూల్ వీరు గొడవ పడ్తుంటే చూడలేక ఎప్పటిలాగే ఇంటి పైకప్పుపైకి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత చూస్తే తల్లి కదలలేని స్థితిలో కన్పించింది. అయితే సైకోగా మారిన శివాజీయే శైలును చంపాడని ఆరోపించారు. తాడుతో గొంతు నులుమి హత్య చేసి ఆతర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడన్నారు. భర్త వేంధిపులు ఎప్పటినుంచే ఉన్నా కేవలం పిల్లల కోసం బతుకుందని ఆత్మహత్య చేసుకునేదే ఉంటే గదిలో తలుపులు బిగించుకొని చేసేదని తెలిపారు. గతంలో సైతం అనేక సార్లు శివాజీ వేధిస్తుంటే కాలనీ వాసులు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తే శివాజీ వారికి ఎదురుతిరిగే వాడని దీంతో వారు ఏమీ చేయలేక ఉండిపోయారన్నారు. ఇలాంటి సైకోతో పిల్లలకూ ప్రమాదం ఉందని.. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మృతురాలి తల్లి వందన, అన్న సూర్యకాంత్ ఫిర్యాధు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యా లేక హత్యా అనే విషయం పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
భర్తే కాలయముడు
వేధించి చంపిన వైనం! నిందితునికి గ్రామస్తుల దేహశుద్ధి వివిధ కోణాల్లో పోలీసుల విచారణ గుడ్డిప(రావికమతం): భర్త వేధింపులు భరించలేకున్నాను.. రక్షించండంటూ నెల క్రితం పోలీసులను ఆశ్రయించింది. మారిపోయానంటూ భర్త నమ్మబలకడంతో కేసు వాపస్ తీసుకుంది. అయితే తీరుమారని భర్త చేతిలో గురువారం రాత్రి ఆమె హతమైంది. జులాయి తిరుగుళ్లు, ఆపై మద్యానికి బానిసైన భర్తే కాలయముడై కడతేర్చిన సంఘటన మండలంలోని గుడ్డిపలో చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు నిందితునికి దేహశుద్ధి చేసి, తాళ్లతో కట్టి ఆపై పోలీసులకు అప్పగించారు. నర్సీపట్నం ఏఎస్పీ సత్యఏసుబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలు మంగ తల్లిదండ్రులు అద్దెపల్లి వరహాలమ్మ, అప్పారావు ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి. టి.అర్జాపురానికి చెందిన మంగ(25)కు గుడ్డిప గ్రామానికి చెందిన పిల్లా సత్తిబాబుతో ఏడాది క్రితం వివాహం చేశారు. సత్తిబాబుకు అంతకు ముందు పెళ్లయింది. ఆమె కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. దగ్గర బంధువు కావడంతో రెండో వివాహమైనా సత్తిబాబుకు తమ తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేశామని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. అప్పట్లో కట్నంగా నగదు, లాంఛనాలు బాగానే ముట్టజెప్పామన్నారు. కట్నంగా మరికొంత మొత్తం తేవాలని, బైక్ కొనివ్వాలంటూ తమ కుమార్తెను వేధించేవాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తమ కుమార్తె పొలీసులను ఆశ్రయించగా పెద్దల కౌన్సెలింగ్‌తో మారినట్టు నటించడంతో కేసు వాపస్ చేసుకుందన్నారు. గురువారం రాత్రి పూటుగా తాగివచ్చి, కొట్టి హింసించి ఉరివేసి చంపేశాడని వాపోయారు. ఆతని తల్లితండ్రులు, అన్నను సైతం తరచూ కొట్టడంతో వారంతా తలోదిక్కుకు పోయారని తెలిపారు. నిందితుడ్ని ఏఎస్పీ విచారించగా..తానే ఉరివేసి చంపానని ఒకమారు చెప్పాడు, గణేష్ సంబరం అనంతరం రాత్రి ఇంటికి వచ్చానని తలుపులు వేసి ఉండటంతో బయటనే నిద్రపోయానని, ఉదయం లేచి చూడగా వంటగదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్న భార్యను దించి అందరికీ కబురు చేశానని మరొకసారి చెప్పాడు. దీంతో చంపాక ఉరివేయబడిందా, ఉరివేయడం వల్ల చనిపోయిందా అనే కోణాల్లో విచారిస్తున్నామని ఏఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. నిందితుడు సత్తిబాబును అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తహశీల్దార్ ఉమామహేశ్వరరావు, కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
కల చెదిరి..తనువు చాలించి..!
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య భర్తే చంపి ఉరివేశాడంటున్న మృతురాలి తల్లిదండ్రులు కర్నూలు నగరంలో ఘటన మృతురాలు తిరుపతి వాసి కర్నూలు: ప్రేమ కోసం కనిపెంచిన తల్లిదండ్రులను కాదనుకుంది. కులం పట్టింపులు లేవని.. నీవు లేకపోతే నేను లేనని మాయ మాటలు చెప్పిన ప్రియుడిని నమ్మింది. జీవితాంతం అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. వివాహం అయిన తరువాత ఆమెకు తెలిసింది తన కలలు కల్లలయ్యాయని. అటు తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేక భర్త వేధింపులు భరించలేక బలవంతంగా తనువు చాలింది. ఈ ఘటన కర్నూలు నగరం గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన ఈశ్వరరెడ్డి, సి.జయశ్రీ అక్కడే విద్యోదయ స్కూల్, కాలేజిలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఇదే సమయంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఇంటినుంచి పారిపోయారు. గత అక్టోబర్ 20వ తేదీన మహానందిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఈశ్వరరెడ్డికి కర్నూలులో సేల్స్‌మెన్‌గా ఉద్యోగం వచ్చింది. వీరిద్దరూ కర్నూలు నగరంలోని గాంధీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. కొన్ని రోజులుగా ఈశ్వర్ రెడ్డి భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు రూ.30లక్షల కట్నం కావాలని, కులం తక్కువ వారని హింసించేవాడు. ముఖం చూపించవద్దని భార్యను సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఈ విషయాలను ఆమె పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సైతం తన చిన్నాన్న సి.నాగరాజుకు ఫోన్‌చేసి తిరుపతికి వస్తున్నానని చెప్పింది. అయితే అదేరోజు రాత్రి 9.45 గంటలకు నాగరాజుకు భర్త ఈశ్వరరెడ్డి ఫోన్‌చేస్ఙ్ఙి మీ అమ్మాయి తలుపులకు గడియ పెట్టుకుని బయటకు రావడం లేదని, వెంటనే రావాలి** అని చెప్పాడు. తిరుపతి నుంచి జయశ్రీ కుటుంబసభ్యులు సోమవారం ఉద యం గాంధీనగర్‌కు చేరుకున్నారు. త లుపులు తెరిచి చూసేలోగా అప్పటికే ఆమె గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని చని పోయి ఉంది. వెంటనే వారు కర్నూలు టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ముల్కన్న ఆధ్వర్యంలో పోలీస్ బృందం సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించింది. భర్తే తమ కుమార్తెను చంపి ఉరివేసి ఉంటాడని జయశ్రీ తల్లిదండ్రులు మునికృష్ణయ్య, సత్యవేణి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.