పెళ్లైన పద్నాలుగు నెలలకే..
► చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న వివాహిత
► భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి తండ్రి
అనంతపురం న్యూసిటీ: అనంతపురం పాతూరుకు చెందిన బంగారు వ్యాపారి కదిరి మోహనాచారి ముగ్గురు కూతుర్లు. పెద్ద కుమార్తె యశోవాణి(26) అదనపు కట్నం కోసం భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. 2014 డిసెంబర్ 12న గోరంట్ల మండలం కొండాపురానికి చెందిన జీబీ ప్రసాద్ ఆచారి(ఎంపీయూపీ స్కూల్ హెచ్‌ఎం) కుమారుడు నరేశ్‌తో యశోవాణి పెళ్లైంది. అప్పట్లో కట్నం కింద రూ.6 లక్షలు, బంగారు కట్టబెట్టారు. పెళ్లైన రెండు నెలల నుంచే యశోవాణికి అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు అధికమయ్యాయి. ఈ విషయంపై కొన్నిసార్లు గొడవపడ్డారు. నేను కావాలా, కట్నం కావాల అంటూ యశోవాణి నిలదీసినా నరేశ్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
ఇక భరించలేకపోయిన ఆమె తన గోడును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. ఏడ్చింది. వారు అల్లుడికి సర్ది చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓసారి యశోవాణి తీవ్ర అనారోగ్యానికి గురైనా భర్త పట్టించుకోలేదు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆపరేషన్ చేయించాడు. అయినా నరేశ్‌లో ఎటువం టి మార్పు రాలే దు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా... : భర్త వేధింపులపై యశోవాణి 2015 నవంబర్ 28న అనంతపురం మహిళ పోలీసు స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో భర్త, అత్తమామలు, ఆడపడుచు తనను ఏ విధంగా రాచి రంపాన పెట్టారో వివరించారు. అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్ బాషా కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా జరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ తరువాత నరేశ్ యశోవాణికి మాయమాటలు చెప్పి కాపురానికి తీసుకెళ్లాడు.
అప్పటి నుంచి పుట్టింటికి పంపనే లేదు. నరేశ్ తండ్రి సైతం కోడలిని బాధించేవాడు. ఉగాది పండుగ కు ఇంటికెళ్తానని చెప్పినా పంపలేదు. దీంతో చివరకు ఈ నెల 6న చెన్నైలో ఆ అభాగ్యురాలు ఉరేసుకుని తనువు చాలించింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చి తిరిగి చూసిన భర్త నరేశ్ భార్య చనిపోయిందన్న సమాచారం పోలీసులు, వారి తల్లిదండ్రులకు తెలిపాడు. యశోవాణి మృతదేహాన్ని ఆదివారం రాత్రి అనంతపురానికి తీసుకువచ్చారు.