ఆమెది ఆత్మహత్య కాదు.. హత్యే
► టాకీ గూడ గ్రామస్తుల పిర్యాధు
► సోమవారం తోషంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వివాహిత
► పోస్టుమార్టం రిపోర్టు తర్వాతే నిర్ధారణ : పోలీసులు
గుడిహత్నూర్ : మండలంలోని తోషం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన మండలంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..మండలంలోని తోషం గ్రామానికి చెందిన శివాజీ బోంమ్డేకు 15 సంవత్సరాల క్రితం టాకీగూడ గ్రామానికి చెందిన శైలు (40)తో వివాహం జరిగింది. కట్న కానుకలతోపాటు సంప్రదాయబద్ధంగా వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు అమూల్, కుమార్తె తనూజ. ఆదిలాబాద్‌లో 8వ తరగతి చదువుకుంటున్నారు. కాగా సోమవారం శైలు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త శివాజీని అదుపులోకి తీసుకున్నారు.
కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి శైలు భర్త వేధింపులు భరిస్తూ వస్తోందని టాకీగూడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ మూడీగా ఉండే శివాజీ సోమవారం సుమారు 4 గంటల ప్రాంతంలో శైలుతో గొడవ పడ్డాడు. అప్పటికే ఇంట్లో ఉన్న కుమారుడు అమూల్ వీరు గొడవ పడ్తుంటే చూడలేక ఎప్పటిలాగే ఇంటి పైకప్పుపైకి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత చూస్తే తల్లి కదలలేని స్థితిలో కన్పించింది. అయితే సైకోగా మారిన శివాజీయే శైలును చంపాడని ఆరోపించారు. తాడుతో గొంతు నులుమి హత్య చేసి ఆతర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడన్నారు.
భర్త వేంధిపులు ఎప్పటినుంచే ఉన్నా కేవలం పిల్లల కోసం బతుకుందని ఆత్మహత్య చేసుకునేదే ఉంటే గదిలో తలుపులు బిగించుకొని చేసేదని తెలిపారు. గతంలో సైతం అనేక సార్లు శివాజీ వేధిస్తుంటే కాలనీ వాసులు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తే శివాజీ వారికి ఎదురుతిరిగే వాడని దీంతో వారు ఏమీ చేయలేక ఉండిపోయారన్నారు. ఇలాంటి సైకోతో పిల్లలకూ ప్రమాదం ఉందని.. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మృతురాలి తల్లి వందన, అన్న సూర్యకాంత్ ఫిర్యాధు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యా లేక హత్యా అనే విషయం పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.