నాకంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్: మహేశ్ బాబు | Prince Mahesh Babu at '1' Nenokkadine Audio | Sakshi
Sakshi News home page

నాకంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్: మహేశ్ బాబు

Published Thu, Dec 19 2013 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

నాకంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్: మహేశ్ బాబు

నాకంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్: మహేశ్ బాబు

 ‘‘నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని... అభిమానంతో ఆదరిస్తున్న మీ రుణం తీర్చుకోలేనిది. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను. చేతులెత్తి నమస్కరించడం తప్ప’’ అని అభిమానులను ఉద్దేశించి మహేష్ ఉద్వేగంగా మాట్లాడారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘1’. ‘నేనొక్కడినే’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. కృతి సనన్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీను వైట్లకు అందించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ-‘‘చాలాకాలంగా దేవిశ్రీ, నేనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. సుకుమార్ కారణంగా మా కలయిక కుదిరింది. సుకుమార్ ఐడియాస్ సూపర్బ్. మూడేళ్లు ఈ సినిమాకోసం ఆయన పడ్డ కష్టం కళ్లతో చూసిన వాణ్ణి.
 
 పీటర్‌హేన్స్ ఈ సినిమాలో నాతో పెద్ద పెద్ద సాహసాలే చేయించారు. బిల్డింగుల మీదనుంచి దూకించేశారు. నేను డాన్సులు చేయడం లేదని అభిమానుల్లో ఓ బాధ ఉంది. ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుంది. మరో సినిమా ఒప్పుకోకుండా రెండేళ్లు మాతో ఉండి అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు కెమెరామేన్ రత్నవేలు. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. టోటల్‌గా నా కెరీర్‌లోనే బెస్ట్ మూవీ ఇది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘దేవిశ్రీతో నా అయిదో సినిమా ఇది. నా గత చిత్రాల్లాగే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఈ లుక్, ఈ కలర్ రావడానికి కారణం రత్నవేలు. సాంకేతికంగా ఈ సినిమా నిజంగా వండర్ అనే చెప్పాలి. ఓ కాఫీ షాప్‌లో రెండేళ్ల క్రితం మహేష్‌కి ఈ కథ చెప్పాను.
 
రీసెంట్‌గా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్క్రిప్ట్‌లో ఎక్కడో చిన్న మార్పు జరిగింది. ‘అప్పుడు నువ్వు ఈ కథ ఇలా చెప్పలేదే’అని అడిగారు. ఆయనలోని జ్ఞాపకశక్తి చూసి అనిపించింది ఎస్.. హీఈజ్ ‘1’ అని. మహేష్‌కి స్విమ్మింగ్ రాదు. కానీ... సముద్రంలో ఎంతో అనుభవం ఉన్నవాడిలా స్కై డైవింగ్ చేసేశారు. ఆయనలోని తెగువ చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. కెమెరాలోంచి ఏ కోణంలో చూసినా అందంగా ఉంటారు మహేష్. ఆయన 360 డిగ్రీల అందగాడు. ఆయన అందం చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. నిజంగా నేను లక్కీ. ఎలాగంటే... ఫ్యూచర్ సూపర్‌స్టార్‌ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గౌతమ్’’అని సుకుమార్ అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, సూపర్‌స్టార్ కృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, నమ్రత, బోయపాటి శ్రీను, సుధీర్‌బాబు, లహరి మ్యూజిక్ మనోహర్‌నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement