హీరోలకేనా అత్యధిక పారితోషికం.. మరి మాకు!
నటి ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ప్రియాంక ఒకరు. అందంతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. నటనలో హీరోల కంటే హీరోయిన్స్ ఏమీ తక్కువ కాదంటూ ఈ మధ్య బాలీవుడ్ లో సంచలన రేపింది. హీరోయిన్స్ కు సరైన పారితోషికం ఇవ్వని సంఘటనలు ఈ మధ్య సినీ ఇండస్టీలో ఎక్కువగానే ఉన్నాయంటూ విమర్శలు గుప్పించింది. సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ పై ఎప్పుడూ చిన్నచూపూ ఉంటుందంటూ మీడియాకెక్కింది. సినిమాల విషయంలో హీరోయిన్స్ ప్రాధాన్యత పెరిగినా, పారితోషికానికి సంబంధించి హీరోల హవానే ఇంకా కొనసాగుతుందని ఆమె ఓ ప్రకటనలో పేర్కొంది. బాలీవుడ్ లో సినిమా నిర్మించడానికి ఇప్పుడు రూ.200 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నారని, అయినా హీరోయిన్స్ కు హీరోలకు ఇచ్చే రెమ్యూనిరేషన్ సగం కూడా లేదంటూ విమర్శలు గుప్పించింది.
ఇక ఆ సాంప్రాదాయం మారాలంటే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెరగాలని సినీ పెద్దల చెవిన వేసింది. ఇప్పటికే హీరోయిన్స్ ముఖ్య భూమిక పోషించిన సినిమాలు వస్తున్నా, వాటి సంఖ్య పెరగాలని తెలిపింది. డర్టీ పిక్చర్స్ లాంటి తదితర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా హీరోయిన్స్ తగిన ప్రాధాన్యత లభించడం లేదని ప్రియాంక తెలిపింది.ఇది మారాలంటే లేడీ ప్రాముఖ్యత ఉన్న సినిమాలు రావాలంటోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే హీరోయిన్స్ కూడా హీరోలతో సమానంగా పారితోషకం తీసుకోవచ్చని ప్రియాంక తెలిపింది.
సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నహీరోయిన్స్ కూడా హీరోలకంటే ఏమీ తక్కువ కాదంటూ బాలీవుడ్ లో గొప్ప చర్చనే లేవదీసింది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మహిళా బాక్సర్ మేరీకామ్ వాస్తవిక జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రం నిర్మాణ దశల్లో ఉండగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజయం సాధించి ఆమె కోరుకున్న పారితోషకం రావాలని ఆశిద్దాం.