నేను మీ పడకగదిలోకి తొంగిచూస్తే..!
‘‘సెలబ్రిటీలంటే చాలామందికి చులకన. ఏది కావాలంటే అది కామెంట్ చేయడానికి పనికొచ్చే ‘వస్తువులు’ అనుకుంటారు. కానీ, మేమూ ‘మనుషులమే’ అని గ్రహించాలి. మేం మేకప్ వేసుకునేది మొహానికి మాత్రమే... మనసుకి కాదు. అందుకని, మా మనసు గాయపడే వ్యాఖ్యలు చేయడం తగదు. ఎవరైతే మా గురించి కామెంట్ చేస్తున్నారో, వాళ్లను ‘నిన్న రాత్రి మీ పడకగదిలో ఏం చేశారు?’ అనడిగితే ఊరుకుంటారా? ఎవరి పడక గదిలోకైనా మేము తొంగి చూస్తే ఒప్పుకుంటారా? ఎవరో ఒకరితో సంబంధం అంటగడితే ఆగ్రహించరా? మరి, మాకూ ఈ ఫీలింగ్స్ ఉంటాయని ఎందుకు గ్రహించరు? నా గురించి జనాలకు ఏమేం తెలియాలో అవన్నీ సామాజిక మాధ్యమం ద్వారా తెలియపరుస్తున్నాను.
అంతటితో సంతృప్తిపడాలి. అంతేకానీ, కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నిస్తే, ఒళ్లు మండుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే, ‘నోరు పారేసుకుంటోంది’ అంటారు. లేకపోతే ‘గయ్యాళి’ అని పట్టం కడతారు. కానీ, ఈ మాటలన్నీ బాధలో నుంచి పుట్టుకొచ్చినవే అని అర్థం చేసుకోవాలి. సెలబ్రిటీలను కూడా మనుషుల్లా చూడాలని విన్నవించుకుంటున్నా.’’
- ప్రియాంకా చోప్రా, కథానాయిక