సినిమా: ఎవరో చేసిన పనికి మరెవరో బలి అవడం అంటే ఇదేనేమో. అంతే కాదు ఆవేశం అనర్థాలకు దారి తీస్తుందన్నది నిజం. అలా ఒక వ్యక్తి సంచలన వ్యాఖ్యలు ఇద్దరికి ఎఫెక్ట్ అవుతున్నాయి. అందులో ఒకరు అగ్రనటిగా రాణిస్తున్న నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్. రెండవ వ్యక్తి కొలైయుధీర్ కాలం చిత్ర నిర్మాత. అసలు విషయం ఏమిటంటే నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కొలైయుధీర్ కాలం. దీనికి బిల్లా–2 చిత్రం ఫేమ్ చక్రి తోలేటి దర్శకుడు. సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా నిర్మాణ బాధ్యతలను చేపట్టి ఆ తరువాత వైదొలిగారు. సంగీత దర్శకుడిగానూ తప్పుకున్నారు. కారణాలేమైనా ఆ తరువాత ఈ చిత్రానికి మదియళగన్ నిర్మాత అయ్యారు. కాగా చాలా కాలం నిర్మాణంలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరగ్గా, ఆ వేడుకలో అతిథిగా పాల్గొన్న నటుడు రాధారవి నయనతారపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత వివాదానికి దారి తీశాయో తెలిసిందే.
చివరికి రాధారవిని డీఎంకే పార్టీ బహిష్కరించే స్థాయికి సీరియస్ అయ్యింది. ఇకపోతే ఆయనకు కౌంటర్ ఇచ్చే విధంగా నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్ కొంచెం ఎక్కువగానే ఆవేశపడ్డాడు. నయనతారపై విమర్శలు చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్రానికి సంబంధించి అనవసర వ్యాఖ్యలు చేశాడు. కొలైయుధీర్ కాలం చిత్ర దర్శక నిర్మాతలు దాన్ని కొన్నేళ్ల క్రితమే వదిలేశారని భావించాను. అలాంటిదిప్పుడు సరికాని కార్యక్రమానికి అనవసర వ్యక్తులు పాల్గొని ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడారని అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు చిత్ర నిర్మాతకు తీరని నష్టాన్ని కలిగించాయట. చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేసే విధంగా నిర్మాతల వర్గం వ్యాపారం చేసుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు వైదొలిగారు. ఆగిపోయిన సినిమా అని విఘ్నేశ్‌శివన్ వ్యాఖ్యలతో ట్రైలర్ విడుదల తరువాత కొలైయుధీర్ కాలం చిత్రాన్ని కొనుగోలు చేద్దామనుకున్న పలువురు బయ్యర్లు వెనక్కుపోయారట. అంతే కాకుండా చిత్ర డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన ఒక ప్రముఖ సంస్థ కూడా వదిలేసిందట. దీంతో విఘ్నేశ్‌శివన్ వ్యాఖ్యల కారణంగా చిత్ర వ్యాపారం బాధించడంతో ఆ నష్టాన్ని ఆయనే భర్తీ చేయాలని, లేని పక్షంలో ఈ వ్యవహారంపై కేసు వేయడానికి నిర్మాత సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment