
2.ఓలో ఎమీ ఉంటుందా?
2.ఓ చిత్రంలో నటి ఎమీజాక్సన్ ఉంటుందా? అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
2.ఓ చిత్రంలో నటి ఎమీజాక్సన్ ఉంటుందా? అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఎందిరన్-2గా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పాటతో ప్రారంభం అయిన ఈ చిత్రానికి 2.ఓ అనే టైటిల్‌ను నిర్ణయించారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 2.ఓ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. అయితే లైకా సంస్థ నిర్మిస్తున్న ఇందులో ఒక హీరోయిన్‌గా నటి ఎమీజాక్సన్ ఎంపికైంది. రజనీకాంత్, ఎమీజాక్సన్‌లపై పాట చిత్రీకరణ కూడా జరిగిపోతోంది.
అయితే ఇప్పుడామె 2.ఓ చిత్రంలో కంటిన్యూ అవుతుందా? అన్నదే ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అందుకు కారణం లేక పోలేదు. కెనడా నుంచి దిగుమతి అయిన ఈ అమ్మడు నటిగా తన పని తాను చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుందామా, అందిన అవకాశాలతో ఎంజాయ్ చేశామా అని కాకుండా తమిళ సంస్కృతి, సంప్రదాయాల విషయంలో తగుదునమ్మా అంటూ తల దూర్చింది. అది ఇప్పుడు ఈ భామను ఇరకాటంలో పడేసింది. అసలు విషయం ఏమిటంటే జల్లికట్టు అనేది తమిళుల వీరత్వానికి చిహ్నం అయిన క్రీడ.
తమిళ ప్రజలు తమ సంస్కృతిలో ఒక భాగంగా భావించే జల్లికట్టు క్రీడను సుప్రీంకోర్టు నిషేధించింది. ఆ నిషేధాన్ని తొలగించాలని పలు తమిళ సంఘాలు, ప్రముఖ వ్యక్తులు పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవ ప్రాణుల సంరక్షణ సమాఖ్య జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయరాదంటూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. దానికి అండగా బాలీవుడ్ బ్యూటీస్ విద్యాబాలన్, బిబాసా బసు, శిల్పాశెట్టి, రవీనాటాండాన్ నిలబడటంతో పాటు ట్విట్టర్‌లో జల్లికట్టుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నటి ఎమీజాక్సన్ వారితో గొంతు కలిపి చిక్కుల్లో పడింది.
జల్లికట్టు క్రీడపై నిషేధం తొలగించరాదంటున్న ఎమీ పై తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. అంతే కాదు 2.ఓ చిత్రం నుంచి ఆమెను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రేపు(21వ తేదీన) రజనీకాంత్,దర్శకుడు శంకర్ ఇళ్లను చుట్టి ముట్టి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు తమిళగ మున్నేట్ర పడై నిర్వాహకురాలు కే.వరలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరి 2.ఓ చిత్ర దర్శక హీరోలు ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారో, ఎమీని తొలగిస్తారా? రక్షిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.