పున్నమి వెన్నెల పునర్నవి | Punarnavi Bhupalam Biography | Sakshi
Sakshi News home page

పున్నమి వెన్నెల పునర్నవి

Nov 3 2019 8:56 AM | Updated on Nov 3 2019 8:56 AM

Punarnavi Bhupalam Biography - Sakshi

ఉయ్యాల జంపాల చిత్రంలో సునీత పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమాయకత్వం నిండిన టీనేజర్‌గా తన నటనతో యావత్‌ ప్రేక్షక, చిత్రలోకాన్ని తనవైపునకు తిప్పుకొంది. సినిమా విజయం తర్వాత చేసింది కొద్ది సినిమాలే అయినా వాసి కన్నా రాశి గొప్పది అన్నట్లుగా ఆయా సినిమాల్లో తనదైన ముద్రవేసి ముందుకు సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్‌–3 కంటెస్టెంట్‌గా బుల్లితెరపై తన పాపులారిటీ ఏంటో తెలియజెప్పింది. ఆమే పునర్నవి భూపాలం. కళల కాణాచి తెనాలికి చెందిన ఈ ముద్దుగుమ్మ గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..

సాక్షి, తెనాలి: రంగస్థలం, వెండితెరపై మెరుస్తున్న నయాతార పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో కూల్‌గా, క్యూట్‌గా ముద్దుముద్దు పలుకులతో ఆకట్టుకున్న ఈ తార, హీరోయిన్‌గానూ పలు అవకాశాలను అందిపుచ్చుకుంది. తాజాగా బిగ్‌ బాస్‌–3 కంటెస్టెంట్‌గా పాపులరైంది. హీరోయిన్‌గా మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.   పునర్నవి జన్మస్థలం కళల తెనాలి అని చాలామందికి తెలీదు. 

కళల కాణాచే జన్మస్థలం..

పునర్నవి భూపాలం తలిదండ్రులు వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తల్లి భాగ్యలక్ష్మిది తెనాలి. తండ్రి నగేష్‌కుమార్‌ విజయవాడకు చెందినవారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెల్లో రెండో అమ్మాయి పునర్నవి. తెనాలిలో జన్మించిన పునర్నవి, ఆమె అక్క, తమ్ముడిని కొన్నేళ్లపాటు ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంచారు. మాంటిస్సోరి స్కూలులో రెండేళ్లు చదివాక, విజయవాడ వెళ్లారు. అక్కడ కెనడీ ఇంటర్నేషనల్‌ స్కూలులో పదోతరగతి వరకు చదివింది. హైదరాబాద్‌లోని ఎల్లామే కాలేజీలో ఇంటర్, బీఏ (సైకాలజీ/ జర్నలిజం) పూర్తిచేసింది.
 
పాఠశాల స్థాయినుంచే నటనపై ఆసక్తి
విజయవాడలో హైస్కూలు చదువులో ఉండగా సమాన అనే మహిళ, స్కూలు వార్షి కోత్సవ ఈవెంట్లను నిర్వహించేవారు. అందులో పునర్నవి తప్పనిసరిగా పార్టిసిపేట్‌ చేసేది. చురుకుదనం, బెరుకు లేకపోవటం, చెప్పింది చెప్పినట్టుగా చేయగల నేర్పు కలిగిన తనను, సమాన బయట ఈవెంట్లకు తీసుకెళ్లటం ఆరంభించారు. ఆ క్రమంలో ఓ జ్యూయలరీ యాడ్‌లో నగలన్నింటికీ ధరింపజేసి, పునర్నవినే మోడల్‌గా నటింపజేశారు.
  
తొలి సినిమానే సూపర్‌ హిట్‌
టెన్త్‌ పరీక్షల తర్వాత కుటుంబం హైదరాబాద్‌కు మారింది. అక్కడ వేసవి సెలవుల్లో ఉండగానే సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నగేష్‌కుమార్‌తో గల స్నేహంతో ఆయన ఇంట్లోనే సినీరచయిత గుత్తి మధుసూదనరెడ్డి, దర్శకుడు విరించి వర్మలు ‘ఉయ్యాల జంపాల’ సినిమా  కథాచర్చలు జరిపారు. అ సినిమాలోనే ‘హీరోయిన్‌ స్నేహితురాలి పాత్ర ఉంది. పునర్నవితో చేయిద్దాం’ అనగానే, సెలవులే కదా...అని సరేనన్నారు. రాజ్‌తరుణ్, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ సినిమా సూపర్‌హిట్టయింది.  తర్వాత శర్వానంద్, నిత్యమీనన్‌ల ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో శర్వానంద్‌ కుమార్తెగా నటించిన పునర్నవికి నటిగా మంచి మార్కులే పడ్డాయి.

కథానాయికగా సైతం..
చదువు కొనసాగిస్తూనే చేసిన ఈ సినిమాలతో హీరోయిన్‌గా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ‘ఉయ్యాల జంపాల’ నటనతో సురేష్‌ ప్రొడక్షన్స్‌ తీసిన ‘పిట్టగోడ’ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమా తర్వాత మహేశ్వరి క్రియేషన్స్‌ ‘ఎందుకో ఏమో’లోనూ నాయికగా నటించారు. ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తీసిన ‘సైకిల్‌’ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. బిగ్‌ బాస్‌–2లో కంటెస్టెంట్‌గా అహ్వానం వచ్చినా, అప్పట్లో అమెరికాలోని తన సోదరి దగ్గర ఉండటంతో వీలుపడలేదు. ఈ సీజనులో బిగ్‌ బాస్‌–3లో పాల్గొన్న పునర్నవికి మంచి గుర్తింపు లభించింది. 

రంగస్థలంపైనా ముద్ర
రంగస్థలంపైనా గల ఆసక్తితో అప్పుడప్పుడూ నటనకు ప్రాధాన్యత కలిగిన నాటకాల్లో నటిస్తూ, అక్కడా పేరుతెచ్చుకోవటం మరో విశేషం. ప్రఖ్యాత నటుడు గిరీష్‌కర్నాడ్‌ రచించిన ‘నాగమండల’ హిందీ నాటకంలో లీడ్‌ క్యారెక్టర్‌ రాణి పాత్రలో పునర్నవి నటనకు రవీంద్రభారతిలో  ప్రశంసలు లభించాయి. ‘నా బంగారుతల్లి’ సినిమాతో అవార్డు గెలుచుకున్న నటుడు, దర్శకుడు రత్నశేఖరరెడ్డి దగ్గర రంగస్థల నటనలో మెలకువలు తెలుసుకున్నారు. రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన మరో నాటికలోనూ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement