ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు..
తమిళసినిమా: అడ్డంకులను ఎదురొడ్డి పురియాద పుథీర్ చిత్రం విజయం వైపు దూసుకుపోతోందని ఆ చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. విజయబాటలో పయనిస్తున్న నటుడు విజయ్‌సేతుపతి. ఆయన కథానాయకుడిగా నటించిన పురియాద పుథీర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలం అయినా కొన్ని ఆర్థిక పరమైన సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
గాయత్రి కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో నటి మహిమా నంబియార్ కీలక పాత్రలో నటించింది. కొత్త దర్శకుడు రంజిత్ జయక్కొడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెబల్ స్టూడియో సంస్థ నిర్మించింది.కాగా జేఎస్‌కే ఫిలిం కార్పొరేషన్ అధినేత జే.సతీష్‌కుమార్ చిత్ర హక్కులను పొంది శుక్రవారం విడుదల చేశారు. అయితే ఇప్పుడు కూడా ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవడంతో చిత్రం ఉదయం ఆటలు రద్దరైన పరిస్థితి.
చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత జే.సతీష్‌కుమార్ మాట్లాడుతూ పురియాద పుథీర్ చిత్రాన్ని తాను 2016లోనే చూసి నచ్చడంతో విడుదల హక్కులను రెబల్ స్టూడియో సంస్థ నుంచి పొందానని తెలిపారు. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల వెంటనే చిత్రాన్ని విడుదల చేయలేక పోయామని వివరించారు.
విజయ్‌సేతుపతి నటించిన చిత్రాల వరుసగా విడుదల అవుతుండడంతో ఇప్పుడు విడుదలకు ప్లాన్ చేశామని చెప్పారు. ఫెఫ్సీకి చెల్లించాల్సిన డబ్బు విషయం గురించి తమకు తెలియజేయకుండా కోర్టుకు వెళ్లడంతో ఆ సమస్యను గురువారం రాత్రి సెటిల్ చేశామని, అయితే కోర్టు క్లియరెన్స్ రావడం ఆలస్యం కావడంతో థియేటర్లలో చిత్ర ఉదయం ఆటల ప్రదర్శన రద్దు అయ్యాయని తెలిపారు. అయినా ఈ చిత్రానికి ప్రేక్షకుల మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని సతీష్‌కుమార్ చెప్పారు. సమావేశంలో విజయ్‌సేతుపతి, మహిమా నంబియార్, దర్శకుడు రంజిత్ జయక్కొడి పాల్గొన్నారు.