
అబ్దుల్ కలాం ప్రశంసలు
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పురియదూర్ ఉలగం సెయ్‌వోయ్ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు చిత్ర యూనిట్‌ను అభినందించడం విశేషం. ముందు ఇల్లు చక్కబెట్టుకుని, ఆ తరువాత దేశాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి అన్న అబ్దుల్‌కలామ్ వ్యాఖ్యల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రం పుదియదూర్ ఉలగం సెయ్‌వోయ్. అవినీతి ప్రక్షాళన కోసం రేపటి పౌరులైన నేటి బాలలు ఎలా తమ తల్లిదండ్రులకు గుణపాఠం చెప్పారన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ తేజు ఫిలింస్ పతాకంపై కెఎస్ నాగరాజన్ రాజా నిర్మించారు.
ఎంఎస్ జయ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఒక ఛానల్‌లో ప్రచారం అయిన సూపర్ సింగర్స్ కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం పొందిన బాలతారలు ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. ఈ చిత్రాన్ని బుధవారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్‌కలాం వీక్షించారు. చక్కని మెసేజ్‌తో పుదియదూర్ ఉలగం సెయ్‌వోయ్ చిత్రాన్ని రూపొందించారని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ తరం యువత వారి తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలన్నారు. అదే విధంగా చిత్రం పలు భాషల్లో రూపొందాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చిత్రం చివరి ఘట్ట దృశ్యాల్లో పదేళ్ల బాలుడు రోషణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు ఉద్వేగభరితంగాను, ఆలోచింపచేసేవిగాను ఉన్నాయని ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని అబ్దుల్‌కలాం ఆకాంక్షించారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. అలాగే చిత్రంలో అజిత్, అను, యాళన్, సంతోష్ బాలాజీలు పాడిన దేశం ఎంగల్‌దేశం పాట బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు.