న్యూఢిల్లీ : మూవీ టికెట్లపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేటు తగ్గింపును ప్రకటించినా అందుకు అనుగుణంగా సినిమా టికెట్ల ధరలను తగ్గించలేదని పీవీఆర్ సినిమాస్, సినిపొలిస్ థియేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ రెండు థియేటర్ చైన్‌లపై యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ రెండు మల్టీప్లెక్స్ సంస్థలు పన్ను తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు మళ్లించలేదని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో న్యూఢిల్లీలోని రెండు సంస్థలపై రాష్ట్రస్ధాయి యాంటీ ప్రాఫిటీరింగ్ కమిటీ ప్రాధమిక దర్యాప్తును పూర్తిచేసింది. పీవీఆర్ థియేటర్లలో సింబా మూవీ టికెట్ల ధరలను తగ్గించలేదని, ఢిల్లీలోని సాకేత్‌లో సినీపొలిస్‌పై కూడా ఇదే తరహా ఫిర్యాదు అందినట్టు అధికారులు తెలిపారు. ప్రేక్షకులకు సినిమా వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో రూ 100కిపైగా ఉన్న మూవీ టికెట్లపై జీఎస్టీని ఈ ఏడాది జనవరి 1 నుంచి 28 శాతం పన్ను శ్లాబు నుంచి 18 శాతం పన్ను శ్లాబుకు మార్చారు. ఇక తక్కువ ఖరీదు కలిగిన టికెట్లపై జీఎస్టీ శ్లాబును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో తమ స్క్రీన్లలో జనవరి 1కి ముందు, తర్వాత సినిమా టికెట్ల ధరలపై పూర్తి వివరాలు అందచేయాలని ఈ రెండు మల్టీప్లెక్స్ సంస్థలను రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ కోరిందని అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆయా సంస్థలు ఎంతమేర లబ్ధిపొందాయో లెక్కగట్టి అందులో కొంత మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమచేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment