
రాజ్యాధికారం కోసం...
కొంతమంది రాజకీయ నాయకులకు ప్రజాసేవ కన్నా రాజ్యాధికారమే పరమావధి. అందుకోసం ఎన్ని గోతులైనా తవ్వుతారు. ఎన్ని మొసలి కన్నీళ్లయినా కారుస్తారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అయితే అలాంటివారి ఆటలు ఎప్పుడూ చెల్లవు. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి చెప్పడం ఖాయం. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘రాజ్యాధికారం’. స్నేహచిత్ర పతాకంపై ఆర్.నారాయణమూర్తి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం విశేషాలను ఆయన వివరిస్తూ- ‘‘మా సంస్థలో ఇది 27వ సినిమా. ఖమ్మం, కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం... తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఇందులో ఆరు పాటలున్నాయి. త్వరలో పాటల్ని, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఆర్.నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కె.రాంబాబు, డాన్స్: ముక్కురాజు.