
ప్రజలు తిరుగుబాటు చేస్తే..!
రైతు కూలీ స్థాయి నుంచి రైతుగా ఎదిగిన కష్టజీవి రామయ్యను ఆ ఊరి పెద్దలు ఏ విధంగా హింసించారు? న్యాయస్థానంలో కూడా అన్యాయానికి గురైన రామయ్య... ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే ఉద్వేగభరితమైన అంశంతో తెరకెక్కిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే సెన్సార్‌కి వెళ్లనుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘నాటికీ నేటికీ దళితులు సమాజంలో ఎందుకు నిరాదరణకు గురవుతున్నారు? అధికారం కోసం కొందరు రాజకీయ నాయకులు ఎలా దిగజారుతున్నారు? ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారు? ఇలాంటి వారిపై ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘రాజ్యాధికారం’.
ప్రజాకవుల సాహిత్యం మా సినిమాకు మణిహారం. ఇందులో నేను రామయ్య అనే దళితునిగా నటించాను. స్వర్గీయ తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి ప్రతినాయక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.ఎవరి భాగాలు వారు పంచేసుకోవాల్సిందే: తెలంగాణకు ప్రత్యేక ఫిలిం చాంబర్ డిమాండ్ కరెక్టే అంటారా? అని నారాయణమూర్తిని అడిగితే -‘‘కచ్చితంగా కరెక్టే. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఎవరి భాగాలు వారు పంచేసుకోవాలి. ఎవరి ఫలాలు వారు అనుభవించాలి. అన్ని విషయాల్లోనూ సమ న్యాయం జరగాలి. రెండుగా విడిపోయిన తర్వాత ఇంకా కలిసి ఉండాలనడం సబబు కాదు. వైజాగ్, రాజమండ్రి, తిరుపతి... ఇలా పలు చోట్లకు పరిశ్రమ తరలి వెళుతుందని అనడం కూడా కరెక్ట్ కాదు.
పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు. ఇక్కడితో పాటు అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది. పలు చోట్ల సినీ పుష్పాలు వికసించడం మంచిదే. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్నారు. అలాంటప్పుడు తెలుగు సినిమా రాష్ట్రాలకు అతీతంగా అభివృద్ధి చెందితే తప్పేంటి?. అప్పుడు ఇక్కడా సినిమాలు తీస్తాం. వైజాగ్, రాజమండ్రి వెళ్లి అక్కడా సినిమాలు తీస్తాం’’ అన్నారు. మరి మీరు ఏ చాంబర్‌లో సభ్యత్వం తీసుకుంటారు? అనడిగితే -‘‘నేను ఆంధ్రుణ్ణి. నా ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన ఫిలిం చాంబర్‌లోనే సభ్యుణ్ణి అవుతాను. అయితే ఏంటి? తెలంగాణలో సినిమా తీస్తే... ఇక్కడి ప్రభుత్వం, ఇక్కడి చాంబర్ నాకు సహకారం అందించరా? తప్పకుండా అందిస్తారు. అలాగే మా సహకారం వారికీ ఉంటుంది. అలా పరస్పర సహకారంతో తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది’’ అని పేర్కొన్నారు నారాయణమూర్తి.