ప్రేమ ప్రయాణం
సందీప్, రెజీనా జంటగా జగపతిబాబు కీలక పాత్రలో యస్వీకే సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘రారా కృష్ణయ్య’. మహేష్‌బాబు .పి దర్శకుడు. బుధవారం జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సందీప్ అన్నయ్యగా జగపతిబాబు చేస్తున్న పాత్ర సినిమాకి ప్రధాన అకర్షణ అవుతుంది. పాటలు, క్లయిమాక్స్ మినహా పూర్తయ్యాయి. అచ్చు స్వరపరచిన పాటలను ఈ నెలాఖరున, వచ్చే నెల సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సందీప్ మాట్లాడుతూ -‘‘జగపతిబాబుగారి తమ్ముడిగా నటించడం నా అదృష్టం. కొత్త నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు. ‘‘ఓ యువతీ యువకుడి ప్రేమ ప్రయాణం, వారు పొందిన మధురానుభూతుల సమాహారమే ఈ సినిమా’’ అని దర్శకుడు తెలిపారు. ‘రొటీన్ లవ్‌స్టోరీ’ తర్వాత సందీప్‌తో నటించడం ఆనందంగా ఉందని రెజీనా చెప్పారు.