ఆ చిత్రమే దీనికి స్ఫూర్తి
‘‘చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. కానీ, పెద్దయిన తర్వాత ఏం చేయాలనే విషయం మీద మాత్రం ఓ స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. ఓ శుభముహూర్తాన సినిమా డెరైక్టర్ కావాలని నిర్ణయించుకున్నా’’ అని పి. మహేశ్‌బాబు చెప్పారు. జగపతిబాబు ముఖ్య పాత్రలో సందీప్ కిషన్, రెజీనా జంటగా రూపొందిన ‘రా రా కృష్ణయ్య’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారాయన. మహేశ్ పుట్టింది భీమవరంలో.. చదువుకున్నది వైజాగ్‌లో. బీటెక్ పూర్తి చేయగానే ఓ మూడు లఘు చిత్రాలు రూపొందించారు. అవన్నీ సామాజిక స్పృహ ఉన్నవే.
ఇక, దర్శకునిగా అనుభవం సంపాదించడం కోసం కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా చేరారు. కృష్ణవంశీ దగ్గర కొంత అనుభవం సంపాదించుకున్న తర్వాత దర్శకునిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ‘రా రా కృష్ణయ్య’ సినిమాకి అవకాశం అడిగే ముందు, ఐదు నిమిషాల కథను చిత్రీకరించారట. ‘‘ఆ సీడీని పలువురు నిర్మాతలకు చూపించాను. కానీ, నిర్మాత వంశీకృష్ణగారు చూసిన వెంటనే ఒప్పుకున్నారు. ఈ సంస్థలో వచ్చిన ‘సోలో’కి దర్శకత్వ శాఖలో చేశాను. సందీప్‌తో మంచి అనుబంధం ఉంది. ఇక, వంద సినిమాలు చేసిన జగపతిబాబుతో సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు.
‘తేరే నాల్ లవ్ హో గయా’, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రాల తరహాలో ‘రా రా కృష్ణయ్య’ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారనీ, కానీ, తాను మాత్రం కొన్నేళ్ల క్రితం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం డానీ బోయిలే దర్శకత్వం వహించిన ‘ఏ లైఫ్‌లెస్ ఆర్డినరీ’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా చేశానని మహేశ్ చెప్పారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందన్నారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా, పరిశ్రమలో తనకు పరిచయమైన అందరూ ప్రోత్సహిస్తున్నారని, అది తన లక్ అని అన్నారు మహేశ్.