వాయువేగంతో రేసుగుర్రం
వాయువేగంతో రేసుగుర్రం
Published Mon, Jan 27 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
వాయు వేగమే ఆయుధం. లక్ష్యసాధనే ధ్యేయం. మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా... అవన్నీ డెక్కల కింద నలిగి చావాల్సిందే. సింపుల్‌గా ‘రేసుగుర్రం’ అంటే అది. కథానుగుణంగా అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే.. ‘రేసుగుర్రం’ అనే టైటిల్ పెట్టారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. బన్నీలోని ఎనర్జీ లెవల్స్ ఏంటో ఈ చిత్రం చెప్పబోతోందని సమాచారం. మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని వినికిడి. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉండే సురేందర్‌రెడ్డి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుందని యూనిట్ సభ్యుల సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు. యువతరం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందీ టీజర్.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. సోమవారం హైదరాబాద్ పరిసరాల్లోని ఓ కళాశాల ఆవరణలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. నేడు(మంగళవారం) ఆర్‌ఎఫ్‌సీలో జరిగే చిత్రీకరణతో ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకూ భారీ సెట్‌లో బన్నీ, కథానాయిక శ్రుతిహాసన్‌పై పాట చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్‌విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు.
Advertisement