'రాధ' మూవీ రివ్యూ | RADHA Movie Review | Sakshi
Sakshi News home page

'రాధ' మూవీ రివ్యూ

Published Fri, May 12 2017 1:43 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

RADHA Movie Review

టైటిల్ : రాధ
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవికిషన్, ఆశిష్ విద్యార్థి,
సంగీతం : రాధన్
దర్శకత్వం : చంద్రమోహన్
నిర్మాత : భోగవళ్లి బాపినీడు

వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధ. ఇటీవల కామెడీ ఎంటర్టైనర్ లతో వరుస విజయాలు సాధిస్తున్న శర్వా, ఈ సారి చిన్న మెసేజ్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధ.. శర్వా సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసిందా..?

కథ :
రాధకృష్ణ.. చిన్నతనంలోనే కృష్ణతత్వానికి ఆకర్షితుడై ఎప్పుడు భగవద్గీత వింటూ భగవంతుడే అంతా నడిపిస్తున్నాడని నమ్ముతుంటాడు. ఒకసారి తనను ప్రమాదం నుంచి కాపాడిన పోలీసే కృష్ణుడని నమ్మి కష్టాల్లో ఉన్నవారిని కాపాడే పోలీసు అవ్వాలని ఫిక్స్ అవుతాడు. అదే కసితో పెరిగి పెద్దవాడైన రాధకృష్ణ.. యూనిఫాం లేకపోయినా క్రిమినల్స్ ఆట కట్టిస్తుంటాడు. డిపార్ట్మెంట్ కు కృష్ణ చేసిన సాయాన్ని గుర్తించిన డీజీపీ.. రాధకు ఎస్సైగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కేసులు లేని స్టేషన్ లో పనిచేయటం ఇష్టం లేదని కోరి మరీ ఎప్పుడూ కేసులు క్రిమినల్స్ తో కలకలలాడే ధూల్ పేట్ స్టేషన్ కు ట్రాన్సఫర్ తెచ్చుకుంటాడు.

రాధ చార్జ్ తీసుకున్న టైంలో పీపుల్స్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గొడవలు జరుగుతుంటాయి. సిట్టింగ్ సీఎం (కోట శ్రీనివాసరావు) తన తరువాత ముఖ్యమంత్రిగా సుజాత (రవికిషన్), సూర్రెడ్డి (ఆశిష్ విద్యార్థి)ల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని హైకమాండ్ కు సూచిస్తాడు. అదే సమయంలో సుజాత మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్ లో కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా చనిపోతారు. పోలీసులు తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించటం కారణంగానే ఇలా జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. పోలీసుల మీద ఈగ వాలితేనే ఒప్పుకొని రాధకృష్ణ.. పోలీసుల మీద పడ్డ నింద ఎలా చెరిపేశాడు..? అసలు సుజాత మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు..? వాళ్ల ఆట రాధకృష్ణ ఎలా కట్టించాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న శర్వానంద్.. ఈ సారి మాత్రం రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తనని తాను కృష్ణుడిగా భావించే పోలీసు ఆఫీసర్ పాత్రలో మంచి కామెడీ పండించాడు. కామెడీ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించిన శర్వానంద్ అంతా తానే అయి సినిమాను నడిపించాడు. హీరోయిన్ పాత్రకు కథలో పెద్దగా స్కోప్ లేకపోవటంతో లావణ్య గ్లామర్ షోతో సరిపెట్టుకుంది. ఉన్నంతలో లవ్ సీన్స్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెప్పించింది. విలన్ గా రవికిషన్ మరోసారి ఆకట్టుకున్నాడు. పైకి మంచివాడుగా నటించే క్రూరమైన పొలిటీషిన్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, శంకర్, సప్తగిరి, తనికెళ్ల భరణి, అక్ష తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
సక్సెస్ ట్రాక్ లో ఉన్న శర్వానంద్ లాంటి యంగ్ హీరో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చంద్రమోహన్ తొలి ప్రయత్నంలో పరవాలేదనిపించాడు. శర్వానంద్ నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ కథను రెడీ చేసుకున్న దర్శకుడు కథనంలో మాత్రం కాస్త తడబడ్డాడు. అయితే శర్వా ఎనర్జీ, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. సాంగ్స్ తో పరవాలేదనిపించిన రాధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. ముఖ్యంగా అసలు కథ మొదలైన తరువాత వచ్చిన లవ్ సీన్స్ కాస్త ఇబ్బంది పెడతాయి. డైలాగ్స్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
శర్వానంద్ నటన
కామెడీ

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
స్లో సెకండ్ హాఫ్

రాధ.. బాహుబలి ఫీవర్ తరువాత మంచి రొమాంటిక్ కామెడీతో రిలీఫ్

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement