
సాక్షి, సినిమా: లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని నటి రాధికాఆప్టే అంటోంది. అర్ధనగ్న దృశ్యాల ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ తరచూ వార్తల్లో ఉండే ఈ ఉత్తరాది భామ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తుంటుంది. కోలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించిన రాధికాఆప్టే టాలీవుడ్‌లోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు లేవు. బాలీవుడ్‌పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది.
అయితే తాజాగా తన హిందీ చిత్ర ప్రచారంలో భాగంగా మరోసారి హీరోయిన్ల లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించి మరోసారి వార్తల్లోకెక్కింది. రాధిక మాట్లాడుతూ హీరోయిన్లకు లైంగిక వేధింపులు అన్నవి నిజమేనని చెప్పింది. అయితే అలాంటి సంఘటనలను అందరూ బయటకు చెప్పుకోలేరని అంది. అలా చెబితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, కలలు కల్లలై పోతాయనే భయం అని అన్నది. అయితే హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలని కోరింది. లేకుంటే అలాంటి సంఘటనలు పెరిగిపోతాయని అన్నది. సమాజంలో మార్పు రావాలని, మహిళలు తమకు జరిగిన అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని చెప్పింది. అప్పుడు దురాగతాలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పింది. తనకు అలాంటి సంఘటనలు పెద్దగా ఎదురవ్వలేదని, తాను ఎదుర్కొన్న అనుభవాలను ఇంతకు ముందే వెల్లడించానని చెప్పింది. అయితే ఇతరుల లైంగిక వేధింపుల గురించి తాను మాట్లాడనని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment