![Radhika Sarathkumar's KodeeswarI Game Show From December 23 - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/15/kodeshwari1.jpg.webp?itok=_1ZCCdxR)
సాక్షి, చెన్నై: మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గేమ్ షోను కలర్స్ తమిళ చానల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ షోలో విజేతగా నిలిచే వారికి రూ. కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈనెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ టీవీ చానల్‌లో నటి రాధికా వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్న కోటీశ్వరి గేమ్ షో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అవుతుంది. కలర్స్ తమిళ టీవీ చానల్, స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కలర్స్ చానల్ వ్యాపారాధ్యక్షుడు అనూప్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల ప్రతిభకు అద్దంపట్టే రీతిలో కోటీశ్వరి గేమ్ షో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధికా శరత్ కుమార్ 15 ప్రశ్నలు వేస్తారని, వాటికి రూ. 1000 నుంచి రూ. 1 కోటి బహుమతి ఉంటుందని అన్నారు.
పోటీదారులు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే రూ. కోటి బహుమతి గెలుచుకోవచ్చని తెలిపారు. గేమ్ ఆడే సమయంలో పోటీ దారులు 50కి 50 శాతం, ఆడియన్స్ పోల్, ఆస్క్ ది ఎక్స్‌పోల్ (నిపుణుల వద్ద సమాధానాలు కోరడం), ప్లిప్ (కొన్ని సమాధానాలలో ఒకదాన్ని ఎంపిక చేయడం) వంటి నాలుగు విధాలైన హెల్ప్‌లైన్‌లు ఉంటాయని వివరించారు. ఈ గేమ్‌షోలో పాల్గొనడం కోసం ఇప్పటి వరకు 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment