'రాజా చెయ్యి వేస్తే' రివ్యూ.. | Raja Cheyyi Vesthe Review | Sakshi
Sakshi News home page

'రాజా చెయ్యి వేస్తే' రివ్యూ..

Published Fri, Apr 29 2016 4:20 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

'రాజా చెయ్యి వేస్తే' రివ్యూ.. - Sakshi

'రాజా చెయ్యి వేస్తే' రివ్యూ..

సినిమా : రాజా చెయ్యి వేస్తే
జానర్ : లవ్, యాక్షన్ డ్రామా
నటీనటులు : నారా రోహిత్, నందమూరి తారకరత్న, ఇషా తల్వార్ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్
దర్శకత్వం : ప్రదీప్ చిలుకూరి
నిర్మాత : సాయి కొర్రపాటి



నెల నెలా వచ్చే జీతం మాదిరిగా ఈ మధ్యన నారా వారబ్బాయి సినిమాలు విడుదలవుతున్నాయి. తుంటరి, సావిత్రి సినిమాలు సందడి చేసి వెళ్లిన వెంటనే తాజాగా ఈ శుక్రవారం 'రాజా చెయ్యి వేస్తే'  అంటూ థియేటర్లకు వచ్చేశాడు. నందమూరి తారకరత్న ఈ సినిమాలో విలన్గా నటించడంతో 'నారా vs నందమూరి' అంటూ సినిమా మీద ఆసక్తిని పెంచారు. ఆ ఆసక్తి ఆసాంతం కొనసాగిందో లేదో ఓ సారి చూద్దాం..

కథేంటంటే...  
రాజారామ్ (నారా రోహిత్) అనే గ్రాడ్యుయేట్.. దర్శకుడు కావాలని తపించిపోతూ ఉంటాడు.  అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ప్రస్తుతం సహాయ దర్శకుడిగా పని చేస్తుంటాడు. నిర్మాత దొరికితే సొంత కథతో సూపర్ హిట్ కొట్టాలనే ప్లాన్తో ఉంటాడు. అతని గాళ్ ఫ్రెండ్ చైత్ర (ఇషా తల్వార్). ఓ రోజు కాఫీ షాప్లో కూర్చుని తాను రాసిన సినిమా కథను చైత్రకు చెబుతుండగా విన్న చుట్టుపక్కలవారంతా థ్రిల్ అయిపోతారు. రాజా రామ్ను తెగ మెచ్చుకుంటారు. ఆ తర్వాత రోజు రాజారామ్కు ఓ లెటర్తో పాటు కొంత డబ్బు కొరియర్లో వస్తుంది.

తానో ప్రముఖ దర్శకుడినని.. అతను రాసిన కథ విని ఇంప్రెస్ అయ్యానని.. తనకి మంచి లవ్ స్టోరీ రాసి పంపాలనేది ఆ ఉత్తరంలోని సారాంశం. సదవకాశంగా భావించిన రాజారామ్ తన ప్రేమ కథనే అందంగా రాసి పంపిస్తాడు. అయితే ప్రస్తుతం ప్రేమ కథ అవసరం లేదని, ఓ యాక్షన్ స్టోరీకి అదిరిపోయే క్లైమాక్స్ కావాలని అడుగుతాడు ఆ అజ్ఞాత దర్శకుడు.  అలానే రాసి పంపుతాడు రాజారామ్.

అక్కడే అసలు ట్విస్ట్. అచ్చంగా అతను రాసిన క్లైమాక్స్ మాదిరిగానే విన్సెంట్ మాణిక్ (తారకరత్న) అనే వ్యక్తిని రాజారామ్ చంపేయాలని, లేదంటే చైత్రను చంపేస్తామంటూ బెదిరింపులు మొదలవుతాయి. మాణిక్.. ఎవరైనా సరే తన దారికి అడ్డొస్తే అడ్డంగా చంపేసే కిరాతకుడు. అలాంటి మాణిక్ను రాజారామ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలా మాణిక్కు, రాజా రామ్కు సంబంధం ఏమిటి ? మాణిక్ను చంపడానికి ఆ అజ్ఞాత వ్యక్తి రాజా రామ్నే ఎందుకు ఎంచుకున్నాడు ? దర్శకుడినంటూ పరిచయమైన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? రాజా రామ్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడన్నదే మిగిలిన కథ.

ఎవరెలా చేశారంటే...  నారా రోహిత్ నటనకు మంచి మార్కులే వేయొచ్చుగానీ.. చూడటానికి మాత్రం గుండ్రంగా గుమ్మడికాయలా తయారయ్యాడు. తారకరత్న స్టైలిష్ విలన్గా లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ఓ రకంగా రోహిత్ను డామినేట్ చేశాడని చెప్పొచ్చు. హీరోయిన్ ఇషా తల్వార్ది ప్రాముఖ్యమున్న పాత్రే అయినా గ్లామర్ కే ఎక్కువ పరిమితమయ్యింది. మిగిలిన నటీనటులంతా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.  సాయి కార్తీక్ సంగీతం థియేటర్ వరకే. నిర్మాణ విలువలు బావున్నాయి. కథలో కొత్తదనం ఉంది కానీ.. దాన్ని తెర మీద ఆవిష్కరించడంలో దర్శకుడు ప్రదీప్ తడబడ్డాడు. కథనానికి బాగా బిల్డప్ ఇచ్చి పేలవంగా ముగించేశాడు. ఇంకాస్త పకడ్బందీగా ప్రయత్నించి ఉంటే బావుండేది.

ఓవరాల్గా 'రాజా చెయ్యి వేస్తే'.. అప్పుడప్పుడు రాంగ్ కూడా అవుతుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement