
గరుడ వేగం
పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రాజశేఖర్. ‘అంకుశం’, ‘మగాడు’, ‘ఆగ్రహం’ తదితర చిత్రాల్లో పోలీస్‌గా అద్భుతమైన నటన కనబరిచి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొంత విరామం తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ పోలీస్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘పీఎస్వీ గరుడ వేగ 126.18ఎం’ టైటిల్ ఖరారు చేశారు. నేడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ ప్రకటించారు.
శివాని శివాత్మిక మూవీస్ సంస్థ సమర్పణలో జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఎం. కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాజశేఖర్‌ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు స్టయిలిష్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. బ్యాంకాక్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నాం. ఫిబ్రవరి 15తో బ్యాంకాక్ షెడ్యూల్ ముగుస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.