
అలా అయితే బాగుండేది: రాజమౌళి
సాక్షి, బళ్లారి: తమిళం తరహాలో కన్నడంలో కూడా బాహుబలి–2 చిత్ర అనువాదానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. ఆయన శనివారం బళ్లారి సిటీలోని రాధిక సినిమా థియేటర్‌లో బాహుబలి–2ను వీక్షించారు. అనంతరం విలేకరుల తో మాట్లాడారు.
బాహుబలి–2 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ శ్రమించడం ఈ విజయానికి దోహదపడిందన్నారు. ప్రస్తుతం మరో కొత్త ప్రాజెక్టు ఏదీ లేదని చెప్పారు. ఈ సక్సెస్‌ను తాను, తన కుటుంబం ఆస్వాదిస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం బెంగళూరు వచ్చిన ‘భల్లాలదేవ’ రానా దగ్గుబాటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కెంపేగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రానాకు కర్ణాటక ప్రభాస్ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, అధ్యక్షుడు అశిష్, సభ్యులు ఆయనకు స్వాగతం పలికి మైసూరు పేటెతో సన్మానించారు.