నటకిరీటి పుట్టిన రోజు
'ఆఫ్టర్ వన్ ఇయర్.. ఐ విల్ బి కింగ్' ఆ ఒక్క డైలాగ్‌తోనే ఆడియన్స్ పెదాలపై నవ్వులు పూయిస్తూ థియేటర్లలో హల్‌చల్ చేసిన కామెడీ కింగ్ ఆయన. కథానాయకుడి పక్కన నిల్చుని.. ఒళ్లంతా విరుచుకుని నవ్వించేందుకు నానాపాట్లు పడాల్సిన పనే లేకుండా ఈ తెర విదూషకుడిని సోలో హీరోని చేసి సైడ్ ట్రాక్‌లో ఉన్న కామెడీని మెయిన్ ట్రాక్‌లోకి తెచ్చి.. పద్నాలుగు రీళ్ల సినిమా అంతా హాస్యానికి పట్టాభిషేకం చేసిన నవ్వుల రారాజు ఆయన.
ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఆఫ్టర్ వన్‌ఇయర్..ఐ విల్‌బీ కింగ్ అంటూనే.. రాజ్యాలు కనుమరుగైన ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ముద్దాడిన ప్రతిఒక్కడూ మకుటంలేని మహారాజే అన్న పచ్చి నిజాన్ని చాటి చెప్పిన హాస్య కిరీటి ఆయన. రీల్‌లైఫ్‌లో ఆ చిత్రంలో అన్న ఆ మాటనే రియల్‌లైఫ్‌లో అనుసరిస్తూ సుమారు నాలుగు దశాబ్ధాలు తెలుగుతెర రంగుల ప్రపంచాన్ని తనదైన హాస్య చతురతతో అలరించిన వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆయన. ఆయనే.. నటకిరీటి డాక్టర్ గద్దె బాబూ రాజేంద్రప్రసాద్.
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లామా పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగ దశాబ్దాలకు చేరువైన ఆయన సినీ ప్రస్తానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించారు రాజేంద్ర ప్రసాద్.
230కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన క్విక్గన్ మురుగన్ పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రంలోనూ హీరోగా నటించారు. నటకిరీటిగా, కామెడీ కింగ్ గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే రాజేంద్రుడిని ఆంధ్రా యూనివర్సిటీ గౌరమ డాక్టరేట్ తో సత్కరించింది.
1991లో రిలీజ్ అయిన ఎర్ర మందారం సినిమాకు తొలిసారిగా నంది అవార్డు అందుకున్న రాజేంద్ర ప్రసాద్.
1994లో రిలీజ్ అయిన మేడమ్ సినిమాకు స్పెషల్ జ్యూరి అవార్డ్ ను అందుకున్నారు. 2004లో మరోసారి ఆ నలుగురు చిత్రానికి ఉత్తమ నటుడిగా నందిని అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, మీ శ్రేయోభిలాషి చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం నటుడిగానే కా మా అధ్యక్షుడు తెలుగు కళామతల్లి సేవచేసుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్.