చెన్నై, పెరంబూరు: రెండు భారీ చిత్రాలు ఒకే సారి తెరపైకి రావడానికి ముస్తాబవుతుండడంతో థియేటర్ల సమస్య తీవ్రంగా మారింది. మూడు వారాల క్రితం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 7వేల థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డివైడ్ టాక్‌తోనే మొదటి రోజే రూ.400 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు చిత్ర వర్గాల సమాచారం. అలా కొన్ని రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టిందట. కాగా తమిళనాడులోనే 3,98 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. కేరళ, ఆంధ్ర, కర్ణాటక, ఇతర దేశాల్లో ఈ చిత్రం రెండో వారంలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. అదే విధంగా చెన్నైలో మూడోవారంలోనూ 80 థియేటర్లు పైగా ప్రదర్శిస్తున్నారు. ఒక్క చెన్నై నగరంరలోనే 2.ఓ చిత్రం రూ.30 కోట్లకుపైగా రికార్డు వసూళ్లను రాబట్టిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందు రజనీ నటించిన కబాలి చిత్రం చెన్నైలో రూ.18 కోట్లు వసూలు చేసి రికార్డుగా నిలిచింది. ఇప్పుడా రికార్డును 2.ఓ బ్రేక్ చేసింది. ఇకపోతే 2.ఓ ప్రపంచవ్వాప్తంగా తమిళవెర్షన్ రూ.461 కోట్లు, తెలుగు, హింది వెర్షన్ రూ.285 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఇప్పటికి 2.ఓ చిత్రం రూ.750 కోట్లకుపైగా వసూలు చేసిందని సమాచారం. ప్రస్తుతం క్రిస్మస్ పండగ సెలవులు రావడంతో రూ.1,000 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని అంచనా.
క్రిస్మస్‌కు విడుదలయ్యే సినిమాలు..
కాగా క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ నెల 20, 21 తేదీలో విజయ్‌సేతుపతి నటించిన సీతక్కాది, జయంరవి నటించిన అడంగుమరు, ధనుష్ మారి– 2, విష్ణువిశాల్ నటించిన సిలుక్కవార్ పట్టి సింగం, శివకార్తీకేయన్ నిర్మించిన కనా చిత్రం విడుదల కానున్నాయి. 2.ఓ చిత్రం ఇంకా ప్రదర్శిస్తుండడంతో కొత్త చిత్రాలకు థియేటర్ల సమస్య తలెత్తుతోంది. సంక్రాంతికి రజనీకాంత్ నటించిన పేట, అజిత్ నటించిన విశ్వాసం వంటి భారీ చిత్రాలు ఒకే సారి తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ రెండు ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చే చిత్రాలే. దీంతో థియేటర్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నాయి సినీ వర్గాలు. ఇక రజనీకాంత్ పేట, అజిత్ విశ్వాసం చిత్రాలు తెలుగులోనూ అనువాద చిత్రాలుగా సంక్రాంతికి విడుదల కానున్నాయి. దీంతో అక్కడా థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment