
టైటిల్‌గా తలైవా పుట్టినరోజు
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరే ఒక ప్రభంజనం. ఇప్పుడీ పేరు చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఆయన పుట్టిన తేదీని కూడా వాడేసుకున్నాడొక అభిమాని. అదే 12.12.1950. ఇది రజనీకాంత్ డేట్ ఆఫ్ బర్త్. ఈ పేరుతో కబాలి సెల్వ అనే రజనీకాంత్ అభిమాని కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి కథానాయకుడిగా నటించేశారు. జియోస్టార్ పతాకంపై కోటీశ్వరరాజు నిర్మించిన ఈ చిత్రంలో తంబిరామయ్య, ఎంఎస్.భాస్కర్, రమేశ్‌తిలక్, కుమరవేల్, ఆదవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, కథానాయకుడు కబాలి సెల్వ మాట్లాడుతూ తాను 40 ఏళ్లుగా రజనీకాంత్ అభిమానినని తెలిపారు. 28ఏళ్ల క్రితం స్థానిక మౌంట్‌రోడ్డులోని క్యాసినో థియేటర్ సమీపంలో రజనీకాంత్ పోస్టర్ చింపుతున్న వారిని కొట్టి పంపించానన్నారు. ఆ సంఘటన కూడా ఈ 12.12.1950 చిత్రం తెరకెక్కించడానికి ఒక కారణంగా పేర్కొన్నారు. తాను కథను సిద్ధం చేసుకుని నిర్మాత కోటీశ్వరరాజుని కలిసి కథను వినిపించగా బాగుంది చేద్దాం అని అన్నారన్నారు.
ఆ తరువాత ఫిబ్రవరిలో రజనీకాంత్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ఇందులో హీరోయిన్ ఉండరన్నారు. ఇందులో నటించడానికి తంబిరామయ్య చాలా సహకరించారని, ఆయన ఇందులో 9 గెటప్‌లలో కనిపిస్తారని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన వారెవరూ పారితోషికం గురించి పట్టించుకోలేదని అన్నారు. దీన్ని అందరికీ నచ్చే విధంగా రూపొందించినట్లు చెప్పారు. అదే విధంగా తాను వావ్ ఎగైనెస్ట్ స్మోకింగ్ అనే సంస్థను నడుపుతున్నానని, దీని ద్వారా స్మోకింగ్‌కు వ్యతిరేకంగా లక్ష మంది పిల్లల సంతకాలను సేకరించి రజనీకాంత్ పుట్టిన రోజున ఆయనకు అందించనున్నానని చెప్పారు.