
రజనీ లేకుండానే కబాలి ఆడియో లాంచ్!
భారీ అంచనాల నడుమ అత్యంత అట్టహాసంగా విడుదల అవుతుందనుకున్న 'కబాలి' ఆడియో చాలా సాదా సీదాగా బయటకు వచ్చేసింది. శనివారం సాయంత్రం అత్యంత సాధారణంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యకు డిస్క్ ఇవ్వడం ద్వారా ఆడియోను విడుదల చేశారు. నిజానికి ఆదివారం ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. కానీ, రజనీకాంత్ ఇంకా అమెరికాలోనే ఉండటంతో ఆడియో విడుదలను వాయిదా వేసినట్లు కథనాలు వచ్చాయి.
ఈలోపే.. 30 సెకండ్ల నిడివి ఉన్న ఆడియో క్లిప్ ఒకటి లీకైంది. ఈ నేపథ్యంలో అధికారికంగానే పాటలను విడుదల చేస్తే మంచిదని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు.. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముగించేసినట్లు తెలుస్తోంది. సినిమా ఆడియోను ఆదివారం విడుదల చేయాలనుకున్నా, అది మంచిరోజు కాదు కాబట్టి శనివారమే విడుదల చేసినట్లు చెబుతున్నారు. కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ సినిమాకు యువకుడైన సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. దాంతో ఈ సినిమా పాటలపై గట్టి అంచనాలే ఉన్నాయి.