kabali movie
-
కబాలి భామ సరికొత్త లేడీ ఓరియంటెడ్ చిత్రం!
2006లో తిరుడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి సాయి దన్సిక. అయితే 2009లో జయం రవితో నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. తరువాత మాంజావేలు, నిల్ గమనీ సెల్లాదే, పరదేశీ వంటి చిత్రాల్లో కథానాయకిగా సత్తాచాటారు. 2016లో రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించిన ఈమె ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాగా తాజాగా ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమె నటించిన ది ప్రూఫ్ చిత్రాన్ని నృత్య దర్శకురాలు రాధిక తెరకెక్కించడం విశేషం. ఈమె మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శశికుమార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) -
సూపర్ స్టార్ @ 66
సినీకళామతల్లికి అత్యంత ప్రియమైన బిడ్డల్లో మన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మ ఒడికి చేరడానికి ఆదిలో ఎంత కష్టపడ్డారో, ఇప్పుడు అంతగా ఇష్టుడయ్యారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సినీకళామతల్లి ఒడిలో అన్న చందాన, కర్ణాటక రాష్ట్రం, బెంగళూర్‌లో శివాజీరావ్ గైక్వాడ్‌గా పుట్టి, ఇక బస్సు కండక్టర్‌గా పెరిగి రజనీకాంత్‌గా రూపాంతరం చెంది ప్రపంచ సినీ స్టార్‌గా ఎదిగిన ఈయన గురించి రాయడానికి పేజీలు, చెప్పడానికి మాటలు చాలవు. 1975లో అపూర్వరాగంగళ్ చిత్రం ద్వారా నటుడిగా పుట్టిన రజనీకాంత్ నట వయసు 41. అయితే 1950 శివాజీ గైక్వాడ్‌గా జన్మించిన ఆయన 66వ ఏట అడుగుపెట్టారు. సోమవారం సూపర్‌స్టార్ పుట్టిన రోజు. భారతీయ సినీరంగంలో, సుమారు నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా ఏలుతున్న ఏకై క నటుడు రజనీకాంత్ అని పేర్కొనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం కలిగిన రజనీకాంత్‌ను పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి భారత ప్రభుత్వ అవార్డులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. ఇటీవలే ఆయన విశేషనట సేవలకుగానూ సెంటనరీ అవార్డు అలంకారమైంది. ఇక కలెక్షన్ల పరంగా రజనీకాంత్ చిత్రాలు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి. 2006లోనే శివాజి చిత్రంతో రూ. 26 కోట్ల లాభాలను ఆర్జించి ఆసియాలోనే జాకీచాన్ తరువాత అత్యధిక వసూళ్లను సాధించిన నటుడిగా వాసికెక్కారు. ఇటీవల రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం అంతకు ముందున్న బాక్సాఫీస్ రికార్డులను చించేసింది. తాజాగా సూపర్‌స్టార్ నటిస్తున్న 2.ఓ చిత్రం 400 వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతూ అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కనుంది.తీరని కోరిక: నిరాడంబరుడు, నిగర్వి అరుున రజనీకాంత్‌కు తీరని కోరిక అంటూ ఏమీ ఉండదు. అయితే ఆయన అభిమానులకు మాత్రం ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలన్నది చిరకాల వాంఛ. మరి వారి కోరికను సూపర్‌స్టార్ నెరవేరుస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. పుట్టిన రోజు వేడుకకు దూరం: రజనీకాంత్ ప్రతి పుట్టిన రోజున తన అభిమానులను కలుసుకుని వారి అభిప్రాయాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అభిమానులైతే పూజలు, కటౌట్లకు పాలాభిషేకాలు, అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాంటిది ఈ సారి జయలలిత కన్నుమూయడంతో తన పుట్టిన రోజు వేడుకకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులకు కూడా ముందుగానే విజ్ఞప్తి చేశారన్నది గమనార్హం. -
రజనీకాంతా.. మజాకా!
స్టైల్ అంటే రజనీ.. రజనీ అంటే స్టైల్ అంటారు. చేతుల్లోని సిగరెట్‌ను పైకి విసిరి నోట్లోకి తెచ్చుకున్నా.. నడకలోనే తనదైన వైవిధ్యం కనబర్చినా, అవతలివాళ్లకు రెండు వేళ్లతో సెల్యూట్ చేసినా.. ప్రతి మూమెంట్లోను రజనీ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన కబాలి సినిమాలో ఈ స్టైల్ కాస్త తగ్గిందన్న అసంతృప్తి అభిమానులకు మిగిలిపోయింది. కానీ, కండక్టర్‌గా జీవితం ఆరంభించి.. దేశవ్యాప్తంగా, ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ స్టైల్ ఈ సినిమాలో కూడా ఏమాత్రం తగ్గలేదని ఆయన వీరాభిమానులు అంటున్నారు. కబాలి సినిమా మొదటి మూడురోజుల్లోనే 200 కోట్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ స్టైల్‌ను చూపించే కొన్ని ‘జిఫ్’లను ఆయన వీరాభిమానులు రూపొందించారు. ఎవరూ ఏమాత్రం అనుకరించలేని రజనీ స్టైల్‌ను ఈ జిఫ్‌లు చూపిస్తాయి. అసలు రజనీ అంటేనే స్టైల్ సిగ్నేచర్ అని ఎందుకంటారో వీటిని చూస్తే తెలుస్తుంది. ఈ జిఫ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తున్నాయి. అలాంటివాటిలో కొన్నింటిని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.. via GIPHY via GIPHY via GIPHY via GIPHY -
రజనీ ఏ హీరోలను ఫాలో అవుతారో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా కేవలం తమిళనాడుకో, తెలుగు రాష్ట్రాలకో మాత్రమే పరిమితం కాలేదు.. దేశం మొత్తానికి ఆయన తన సత్తా చూపించారు. కబాలి సినిమా ఇటు దక్షిణాది నుంచి అటు ఉత్తరాది వరకు చాలా రాష్ట్రాలలో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇంత పేరున్న రజనీకాంత్‌ను ట్విట్టర్లో దాదాపు 30 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మరి రజనీ ఎవరిని ఫాలో అవుతున్నారు.. ఎంత మందిని ఫాలో అవుతున్నారో అనే విషయం కూడా ఆసక్తికరమే కదా.. ఆయన ఫాలో అయ్యే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు.. వాళ్లలో ఒకరు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కాగా, మరొకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ!! అవును ఒకవైపు హిందీ సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న పెద్ద హీరోను ఫాలో అవుతున్న రజనీ కాంత్, అదే సమయంలో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కేంద్రస్థానంలో ఉన్న మోదీని ఫాలో అవ్వడం అంటే ఒక రకంగా పెద్ద విశేషమే. వీళ్లిద్దరూ కాక ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కొన్ని జాతీయ వార్తా సంస్థలను కూడా రజనీ ఫాలో అవుతున్నారు. అంతా కలిపి ఆయన ఫాలో అయ్యేది కేవలం 19 అకౌంట్లు మాత్రమే. అదీ సంగతి!! -
కబాలి నెంబర్.. 8 లక్షలు!
ఎంత డివైడ్ టాక్ వచ్చినా అభిమానుల్లో మాత్రం కబాలి ఫీవర్ ఇంకా తగ్గలేదు. రజనీకాంత్ వీరాభిమాని ఒకరు తన కారు మీద శాశ్వతంగా కబాలి ఉండిపోవాలని అనుకున్నారు. అందుకోసం కొత్త ‘ఆడి’ కారు కొన్నారు. అయితే, ఆయన ఉండేది తమిళనాడులోని ఒక పట్టణంలో. అక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తే టీఎన్ అనే సిరీస్ వస్తుంది. కబాలి పేరుతో కారు నెంబర్ కావాలని కర్ణాటక వెళ్లారు. అక్కడ ఎటూ కేఏ సిరీస్ వస్తుంది. అందులో కేఏ8ఏఎల్1 అనే నెంబరు కావాలని ముందుగా బుకింగ్ చేసుకున్నారు. ఆ నెంబరు వేలానికి వచ్చింది. తమ హీరో కోసం ఎంతయినా ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్న సదరు అభిమాని.. ఏకంగా 8 లక్షలు పెట్టి ఆ నంబరు కొనుక్కున్నారట. దాన్ని ఇంగ్లీషులో కేఏబీఏఎల్ఐ (కబాలి) అని వచ్చేలా రాయించుకున్నారు. పైన రజనీ బొమ్మ కూడా వేయించి, కబాలి అని మాత్రమే కనిపించేలా నంబర్ ప్లేటు వేసుకుని ఆయన తన ఆడి కారులో రాజసంగా తమిళనాడు వీధుల్లో తిరుగుతున్నారు. ఇది చూసిన తోటి అభిమానులు.. ముచ్చటపడి ఆ కారును వెనక నుంచి ఫొటో తీసి సోషల్ మీడియాలో మొత్తం విషయంతో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వాట్సప్, ఫేస్‌బుక్‌లలో వైరల్‌గా వ్యాపిస్తోంది. -
మొదటి రోజే వంద కోట్లు!
బాలీవుడ్ సినిమాలు ఏవైనా వందకోట్ల కలెక్షన్ రావాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. కానీ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఆ ఫీట్‌ను ఒక్కటంటే ఒక్కరోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా కలెక్షన్లు ఎంతో అధికారికంగా ఇంకా రావాల్సి ఉందని, కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం రూ. 100 కోట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేవుడి దయతో సినిమా బాగా ఆడుతోందని చెప్పారు. భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా కలెక్షన్లు బాగున్నట్లు కలైపులి తెలిపారు. సినిమా విషయంలో భాష ఎప్పుడూ సమస్య కాబోదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్లలో సినిమా విడుదలైందని, అమెరికాలో 480, మలేసియాలో 490, గల్ఫ్ దేశాల్లో 500 స్క్రీన్లలోను సినిమా విడుదలైనట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ నటుడికీ ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్లు రాలేదని, దాన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద సూపర్ స్టార్ ఒకరేనని, ఆయన రజనీకాంతేనని అన్నారు. సంఘ వ్యతిరేక శక్తుల వల్ల పైరసీ భూతాన్ని అడ్డుకోవడం కష్టం అవుతోందని కలైపులి ఎస్ థాను ఆవేదన వ్యక్తం చేశారు. 1978లో రజనీకాంత్ నటించిన భైరవి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించినప్పుడు ఆయనను కలైపులి ఎస్. థాను తొలిసారి కలిశారు. 1984లో నిర్మాతగా మారి అర్జున్ నటించిన యార్ సినిమా నిర్మించారు. రజనీకాంత్ ఆ సినిమాలో అతిథిపాత్ర పోషించారు. అప్పటినుంచి రజనీ తనకు బాగా సన్నిహితుడయ్యారని, 32 ఏళ్లుగా ఆయనతో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నానని అన్నారు. కొచ్చాడయాన్, లింగా సినిమాలు ఫ్లాప్ కావడంపై ప్రశ్నించగా.. కొచ్చాడయాన్లో రజనీ నటించలేదని.. కేవలం ఆయన గొంతు మాత్రమే ఉంటుందని అన్నారు. ఇక లింగాపై రకరకాల రూమర్లు వచ్చినా.. ఆ సినిమా రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పారు. -
కబాలి చేతిలోని పుస్తకం ఏంటో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి నుంచి కమల హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ వరకు చాలామంది స్టార్ హీరోలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటనలో కూడా నటించలేదు. రజనీ తాజా సినిమా కబాలి విడుదల సందర్భంగా ఆయన క్రేజ్‌ను వాడుకునేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డాయి. విశేషమేంటంటే.. ఎవరూ ఊహించనివిధంగా రజనీ ఓ తెలుగు రచయిత పుస్తకానికి విశేష ప్రాచుర్యం కల్పించారు. కబాలి ట్రైలర్లో రజనీ జైల్లో ఓ పుస్తకాన్ని చదువుతూ కనిపిస్తారు. ఆ పుస్తకం ఏంటో తెలుసా? తెలుగు దళిత రచయిత ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలయ్య (తెలుగులో మా నాయిన బాలయ్య) పుస్తకం. ఈ ఇంగ్లీష్ వర్షెన్ పుస్తకాన్ని కబాలి సినిమాలో రజనీ చదువుతున్నట్టుగా కనిపిస్తారు. కబాలి ఫీవర్‌తో ఊగిపోతున్న ప్రేక్షకులకు ఈ పుస్తకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. రజనీ ద్వారా ఈ పుస్తకానికి దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కబాలి సినిమా మాదిరిగా ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యంలేదని చెబుతున్నారు. రచయిత వైబీ సత్యనారాయణ.. దళితులు ఎదుర్కొన్న వివక్ష, ఆత్మగౌరవం కోసం వారు చేసిన పోరాటం గురించి రాశారు. -
కబాలి విమాన ప్రయాణికులకు నిరాశ
కబాలి ఫీవర్‌ను సొమ్ము చేసుకోడానికి కార్పొరేట్ కంపెనీలు చాలా ప్రయత్నాలే చేశాయి. ఎయిర్ ఏషియా అయితే తమ విమానం ఒకదాన్ని మొత్తం కబాలి పోస్టర్‌తో నింపేసింది. రజనీ స్టైల్లో స్పెషల్ ‘కబాలి’ లుక్ తో ముస్తాబైన ఈ విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, చండీగఢ్, జైపూర్, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, కొచ్చి మీదుగా ప్రయాణించనుందని ప్రకటించారు. అందులో టికెట్లు బుక్ చేసుకున్న వారికి రకరకాల సదుపాయాలతో పాటు చెన్నైలో కబాలి సినిమాను చూపిస్తామని చెప్పారు. అయితే.. మొదటి రోజే ఆ విమానంలో వెళ్లి సినిమా చూడాలనుకున్న అభిమానులకు కొంత నిరాశ తప్పలేదు. ఎయిర్ ఏషియా కంపెనీ సినిమా చూపించే ప్రదేశంతో పాటు సమయాన్ని కూడా రీషెడ్యూల్ చేసింది. అయితే ప్రయాణికులు మాత్రం ఎక్కడో వేరేచోట కాకుండా చెన్నైలోనే అభిమానుల మధ్య కూర్చుని థియేటర్లో సినిమా చూడాలని పట్టుబట్టారు. కానీ.. ప్రస్తుతానికి అది సాధ్యం కాదని, సినిమా ప్రదర్శన ప్రాంతం, సమయం మారిన విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో తాము చిన్న పొరపాటు చేశామని కంపెనీ అంగీకరించింది. దానికి గాను అభిమానులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. -
బ్లాక్‌లో కబాలి టికెట్లు: నలుగురు అరెస్ట్
శంషాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన కబాలి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలనుకొనేవారికి థియేటర్ల లో హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గణేష్ థియేటర్లో హౌస్‌ఫుల్ బోర్డు వేసి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. కొనుగోలు చేయాలని ప్రయత్నించిన అభిమానులకు టికెట్ల రేట్లు చూసి దిమ్మతిరిగిపోతోంది. దీంతో అభిమానులు బ్లాక్ టికెట్ల వ్యవహారంపై ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుచి సినిమా టికెట్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
జీవితంలో ఒక్క యాడ్ కూడా చేయని హీరో!
టాలీవుడ్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, అఖిల్.. ఇలా చాలామంది ప్రకటనలలో కనిపిస్తారు. ఫలానా బ్రాండ్ అంటే తమకిష్టమని చెబుతారు. కేరళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్లు సబ్బులు, నగలు, బ్యాంకులు, చివరకు కూరల్లో వేసే మసాలా ప్రకటనలలో కూడా కనిపిస్తారు. కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ లాంటివాళ్లు పాలు, నగల బ్రాండ్లకు ప్రకటనలలో నటిస్తారు. తమిళనాడులో కమలహాసన్ లాంటి వాళ్లు సైతం ఈ మధ్యనే ప్రకటనలలో కనిపించారు. అయితే, ఒక వస్త్ర కంపెనీ ప్రకటనలో నటించగా వచ్చిన రూ. 16 కోట్లను హెచ్ఐవీ బాధిత పిల్లల కోసం కమల్ విరాళంగా ఇచ్చేశారట. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. కబాలి సినిమాతో అంతర్జాతీయంగా కూడా బాక్సాఫీసులను షేక్ చేస్తున్న సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రకటనలో కూడా నటించలేదు. సినిమాలు తప్ప ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. 42 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించిన రజనీ కాంత్ ఒక్క కనుసైగ చేస్తే చాలు.. ఆలిండియా టాప్ బ్రాండ్లు అన్నీ ఆయన కాళ్ల ముందు వాలిపోతాయి. కోట్లకు కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతాయి. గత కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ ఖాన్ల త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లతో పాటు అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు కూడా ప్రకటనలలో నటించిన కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించారు. కానీ రజనీ మాత్రం తన కెరీర్ ఎంత పీక్ స్థాయిలో ఉన్నా, వరుసగా ఫ్లాప్‌లు చూసినా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రకటనలను ఆశ్రయించలేదు. రెండు కోట్లకు పైగా ఇస్తామంటూ ఓ కోలా కంపెనీ రజనీ వద్దకు ఆఫర్ తీసుకెళ్దామని చూస్తే.. తలైవా వాళ్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. రజనీ గుడ్‌విల్ ఏ కార్పొరేట్ బ్రాండ్ కంటే చూసినా చాలా ఎక్కువని, దేశంలోని ఏ నాయకుడి కన్నా, కార్పొరేట్ లీడర్ల కన్నా ఆయనకు ఎక్కువ విలువ ఉందని.. దాన్ని ఎవరూ డబ్బుతో కొలవలేరని ముంబైకి చెందిన బ్రాండ్ ఎండార్సర్ అనిర్బన్ బ్లా చెప్పారు. -
దేశ వ్యాప్తంగా కబాలీ సంబరాలు
-
కబాలి కోసం.. రాత్రి నుంచి థియేటర్ల దగ్గరే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా హై ఎక్స్పెక్టేషన్ల మధ్య తెల్లవారుజామునే విడుదలైంది. చాలావరకు థియేటర్లలో ఉదయం 4గంటల నుంచే సినిమా ప్రదర్శనలు మొదలైపోయాయి. రజనీ వీరాభిమానులు భారీ ఎత్తున అర్ధరాత్రి నుంచి థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తాము రాత్రంతా థియేటర్ల దగ్గరే ఉన్నామని, రాత్రి 11 గంటలకే వచ్చి అక్కడ బ్యానర్లు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టామని చెన్నైలోని కాశీ థియేటర్ వద్ద మదన్ కుమార్ అనే అభిమాని చెప్పాడు. 65 ఏళ్ల హీరో మలేషియా నుంచి వచ్చిన డాన్ పాత్రలో నటించిన ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అయితే కబాలి ఫీవర్ దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మొదలైపోయింది. ఒమన్ లాంటి దేశాల్లో కూడా కబాలి టికెట్లు కొనడానికి భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించాయి. ఈ విషయాన్ని రజనీ అభిమాని ఒకరు తన ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను పోస్ట్ చేశారు. రజనీ సినిమా ఎప్పుడో ఒకప్పుడు చూస్తే కుదరదని, మొట్ట మొదటి రోజు.. అది కూడా మొట్ట మొదటి షో మాత్రమే చూడాలని, అందుకే గత కొన్ని రోజులుగా టికెట్ల కోసం నిద్రాహారాలు మాని ప్రయత్నించానని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సుమంత్ చెప్పాడు. చెన్నై నగరంతో పాటు మదురై లాంటి ప్రాంతాల్లో కూడా ఉదయం 3 గంటలకే కబాలి విడుదలైంది. మొదటి వీకెండ్లో.. అంటే ఈ మూడు రోజుల పాటు మదురైలో దాదాపు 300 షోలు ప్రదర్శిస్తారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, అమెరికా లాంటి దేశాల్లో గురువారం రాత్రే ప్రీమియర్ షోలు వేశారు. అమెరికాలో విడుదలకు ముందే బుక్ చేసుకున్న టికెట్లతో దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చేశాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ విడుదలైంది. మలయా భాషలోకి డబ్ చేసిన వెర్షన్ ఈనెల 29.. అంటే వచ్చే శుక్రవారం విడుదల అవుతుంది. -
బెంగళూరు హోటళ్లకు షాక్
-
బెంగళూరు హోటళ్లకు షాక్
కబాలి సినిమా ఫీవర్‌ను క్యాష్ చేసుకోడానికి కర్ణాటక రాజధాని బెంగళూరులో కొన్ని స్టార్ హోటళ్లు చేసిన ప్రయత్నాలకు గండిపడింది. ఆ హోటళ్లలో కబాలి సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. హోటళ్లలో సినిమాల ప్రదర్శన సినిమాటోగ్రఫీ చట్టానికి వ్యతిరేకమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ తెలిపింది. దీంతో సినిమా ప్రదర్శనను రద్దు చేసిన హోటళ్ల యాజమాన్యాలు.. టికెట్ డబ్బులను తిరిగి ఇస్తున్నాయి. థియేటర్లో కాకపోయినా ఎక్కడో ఒకచోట కబాలి సినిమా మొదటిరోజు చూసేందుకు వీలు కుదిరింది కదాని సంతోషపడిన అభిమానులకు మాత్రం ఈ చర్యతో తీవ్ర నిరాశ మిగిలింది. -
తెల్లవారే 3 గంటల నుంచి.. అర్ధరాత్రి వరకు!
కబాలి సినిమాకు తమిళనాడులోను, ఇంకా మాట్లాడితే దక్షిణాది రాష్ట్రాల్లోను క్రేజ్ ఉందంటే చెప్పుకోవచ్చు. కానీ ముంబైలో ఓ థియేటర్ మాత్రం ఏకంగా దాదాపు రోజు మొత్తం అంటే ఇంచుమించు 24 గంటలూ కబాలి షోలను ప్రదర్శిస్తోంది. ముంబై మహానగరంలోని కింగ్స్ సర్కిల్లో ఉన్న 74 ఏళ్లనాటి అరోరా థియేటర్లో తెల్లవారుజామున 3 గంటలకు మొట్టమొదటి షో ప్రదర్శితం అవుతుంది. అప్పటి నుంచి వరుసగా ఉదయం 6 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు షోలు వేస్తున్నారు. మొత్తం అన్ని షోలకు సీట్లన్నీ బుక్ అయిపోయాయని థియేటర్ యజమాని నంబి రాజన్ చెప్పారు. ఆయన రజనీకాంత్ వీరాభిమాని. అరోరా థియేటర్ నుంచి ఒక ఓపెన్ టాప్ బస్సులో సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారు. ఇది గత కొన్ని రోజులుగా నగరంలో పలు ప్రాంతాలు తిరుగుతూ రజనీ అభిమానులను అలరిస్తోంది. ముంబై సినీచరిత్రలోనే తొలిసారిగా రెండు భారీ కటౌట్లతో పాటు ఓ పెద్ద పోస్టర్‌ను కూడా థియేటర్ వద్ద పెడుతున్నారు. కబాలి సినిమా కోసం థియేటర్‌కు కొత్తగా రంగులు వేయించామని, కొత్త స్క్రీన్ పెట్టించామని, లైటింగ్ కూడా మార్పించామని రాజన్ చెప్పారు. మొదటి రోజు తర్వాత మాత్రం ప్రతిరోజు లాగే నాలుగు ఆటలు ప్రదర్శిస్తారు. దీనికి కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే పూర్తయింది. ముంబైలోని రామమందిరంలో శుక్రవారం నాడు రజనీ అభిమానులు భారీప్రదర్శనగా వెళ్లి ప్రత్యక పూజలు చేయిస్తున్నారు. నగరంలోని ప్రముఖ కంటివైద్య నిపుణుడు, రజనీ వీరాభిమాని అయిన ఎస్. నటరాజన్ అయితే.. ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నగరవ్యాప్తంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఉంటాయి. -
రజనీ లుక్స్ వెనక సీక్రెట్ ఏంటో తెలుసా?
ఎప్పటికప్పుడు తన సరికొత్త లుక్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు రజనీకాంత్. ఎక్కడో బెంగళూరులో బస్సు కండక్టర్‌గా ఉండే శివాజీరావు గైక్వాడ్ ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడం, ఇన్ని వందల కోట్ల కలెక్షన్లు సాధించడం.. ఇదంతా నిజానికి వండరే. ఒక్క భారతదేశంలోనే కాక.. ఆసియా ఖండంలో ఉన్న అన్నిదేశాల్లోనూ కబాలి విడుదల అవుతోంది. దీన్ని బట్టే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతలా విస్తరించిందో తెలుస్తుంది. రజనీకాంత్ కొత్త సినిమా విడుదల అయిన ప్రతిసారీ ఆ పేరుతో చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని న్యూ నీలాభవన్ హోటల్లో కొత్త మెనూ వస్తుంది. రాజాధి రాజా దోశ, దళపతి పరోటా, నరసింహ సురుట్టు పరోటా, రోబో నూడుల్స్.. ఇలా చాలానే ఉన్నాయి. ఆయన డైలాగులలో పంచ్ పవర్ ఎప్పటికప్పుడు పెరుగుతుంది తప్ప తగ్గదు. ‘ఇది ఎలా ఉంది’ అంటూ ప్రతిసారీ రజనీ కొత్త స్టైల్ చూపిస్తుంటారు. ఆయన స్టైల్ స్టేట్మెంటును అనుకరించేందుకు చాలామంది ప్రయత్నించినా.. అది కాపీలాగే కనిపిస్తుంది తప్ప ఏమాత్రం ఒరిజినల్ లుక్ ఉండదు. మరి 65 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ రజనీ అంత చురుగ్గా, చలాకీగా ఎలా ఉండగలుగుతున్నారు? కబాలి సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకోడానికి మీడియా ప్రయత్నించింది. ఆహారం విషయంలో కచ్చితంగా ఉండటం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్లే ఇది సాధ్యమవుతోందని రజనీ గతంలో చెప్పారు. 2008 సంవత్సరంలో కుచేలన్ సినిమా ఆడియో ఆవిష్కరణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చక్కెర, అన్నం, పాలు, పెరుగు, నెయ్యి.. ఇవన్నీ వదిలేశానని, ముఖ్యంగా 40 తర్వాత వీటిని వదిలేస్తే ఎవరైనా యంగ్ లుక్‌తోనే ఉంటారని తెలిపారు. ఉదయం 5 గంటలకే లేచి గంట సేపు జాగింగ్ చేస్తానని, సాయంత్రం ఊకడా కాసేపు నడిచి, ప్రతిరోజూ ధ్యానం తప్పనిసరిగా చేస్తానని అన్నారు. యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ముఖంలో మెరుపు వస్తుందన్నారు. రాత్రిపూట బాగా పడుకోవాలని కూడా ఆయన తెలిపారు. ప్రతిసారీ సినిమా విడుదలైన తర్వాత హిమాలయాలకు కూడా వెళ్లి వస్తుంటారు. -
కబాలి బ్లాక్ బస్టర్ అవుతుంది
-
ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక విషయం జోరుగా చక్కర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ తన సినిమా సుల్తాన్‌ను ఈద్ రోజున విడుదల చేయించారు. అది సెలవు కాబట్టి, కలెక్షన్లు బాగుంటాయని అలా చేశారట. రజనీకాంత్ మాత్రం తన కబాలి సినిమాను యథాతథంగా శుక్రవారమే.. అంటే ఈనెల 22న విడుదల చేస్తున్నారు. అయితే.. తాను ఎప్పుడు సినిమా విడుదల చేయిస్తే అదే సెలవు అయిపోతుందని రజనీ అంటున్నట్లుగా ఈ ఇద్దరు హీరోల ఫొటోలతో కూడిన మెసేజి ఇప్పుడు వాట్సప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలలో వైరల్ అయ్యింది. ఇదేదో సరదాగా అన్న విషయం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. తలైవా సినిమా విడుదల అవుతోందని ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించేశాయి. కొన్ని కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ సినిమా విడుదల అవుతున్న 22వ తేదీన ఉన్నట్టుండి సిక్ లీవు పెట్టాలని అనుకోవడంతో ఆ విషయం సదరు యాజమాన్యాలకు తెలిసిపోయింది. ఎందుకొచ్చిందని.. కంపెనీలు ముందుగానే సెలవు ప్రకటించేశాయి. దాంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది లాంగ్ వీకెండ్ అయింది. చెన్నై, బెంగళూరులలోని చాలా కంపెనీలు కబాలి విడుదల సందర్భంగా సెలవు ఇచ్చాయి. ఒక కంపెనీ అయితే.. ఏకంగా నోటీసులోనే తమ ఉద్యోగుల విషయాన్ని ప్రస్తావించింది. తలైవా రజనీ సినిమా కబాలి విడుదల సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నామని, ఆరోజు ఉద్యోగులు సిక్ లీవు పెట్టకుండా, మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేయకుండా ఉండేందుకు సెలవు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాక.. ఉద్యోగులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా కబాలి సినిమా టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఓపస్ వాటర్ ప్రూఫింగ్ కంపెనీ, చెన్నైకి చెందిన ఫిండస్ ఇండియా లాంటి వాళ్లు ఇలాంటి ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు. దీపావళికి, దసరాకు బోనస్ ఇచ్చినట్లే తాము తమ ఉద్యోగులకు కబాలి బోనస్ ఇస్తున్నామని చెబుతున్నారు. దాంతో మిగిలిన కంపెనీలవాళ్లు కూడా తమకు సెలవు ఇవ్వాలని అడుగుతున్నారు. -
వెబ్సైట్లపై కబాలి పంజా
-
నాన్నకు ప్రేమతో.. ఆ సినిమా చేయించా!
రేపు.. అంటే ఆదివారం ఫాదర్స్ డే. వేలు పట్టి నడిపించిన తండ్రి కోసం పిల్లలు ఏమైనా చేస్తారు. అదే సెలబ్రిటీల పిల్లలైతే.. మరికొంచెం ఎక్కువగా చేసి తండ్రికి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మరి ఆలిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఏం చేసింది? నాన్నకు ప్రేమతో.. ఓ సినిమా చేయిస్తోంది. ఆ సినిమా టీజర్ దగ్గర నుంచి పాటల వరకు ప్రతి ఒక్కటీ యూట్యూబ్‌లో సంచలనాలు రేపుతున్నాయి. అవును.. రజనీకాంత్ కూతురు సౌందర్య పూనుకోవడం వల్లే కబాలి సినిమా వస్తోంది. ఈ విషయం ఇంతవరకు బయటపడలేదు. తాజాగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ సినిమా వెనక కథ చెప్పింది. వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్‌గా చేసే రోజుల నుంచి పా రంజిత్ ఎవరో సౌందర్యకు తెలుసు. నిజానికి రంజిత్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అట్టకత్తికి సౌందర్యే నిర్మాత కావాలి గానీ కుదరలేదు. ఒకరోజు తండ్రీ కూతుళ్లు మాట్లాడుకుంటుండగా.. రంజిత్ తీసిన 'మద్రాస్' సినిమా ప్రస్తావన వచ్చింది. అది చాలా బాగుందని రజనీ అన్నారు. తర్వాత రంజిత్‌ను సౌందర్య కలిసినప్పుడు, 'నాన్న కోసం ఓ సినిమా కథ చెబుతావా' అని అడిగేసరికి ఆయన షాకయ్యాడు. కొన్ని రోజులు ఆగి స్టోరీ లైన్ చెప్పాడు. 'ఆయనో మలేషియన్ డాన్' అన్నాడు.. అంతే, అదే లైను గురించి రజనీకి సౌందర్య చెప్పారు. ఆయనకు అది వెంటనే నచ్చి, ఓకే అనేశారు. కలైపులి ఎస్.థానుకు స్వయంగా ఫోన్ చేసి, ఈ సినిమాను నిర్మించాలని అడిగారు. ఎప్పుడో తీసిన భైరవి సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. ఇది ఏకంగా రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నది కావడంతో కలైపులినే నిర్మాతగా రజనీ ఎంచుకున్నారు. ఇందులో రజనీకాంత్ కబాలీశ్వరన్ అనే ముసలి డాన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్య కుందనవల్లిగా రాధికా ఆప్టే నటిస్తోంది. ఒకప్పుడు తాను ఏలిన, తాను ఎంతగానో ప్రేమించే చెన్నై నగరానికి మలేషియన్ డాన్ కబాలి తిరిగి రావడం, ఇక్కడ మళ్లీ రాజ్యమేలడం లాంటివి ఈ సినిమా ప్రధానాంశాలని తెలుస్తోంది. -
కాళహస్తిలో రజనీ కుమార్తె పూజలు
కాళహస్తి: ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య బుధవారం శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించారు. రజనీకాంత్ తాజా చిత్రం కబాలి చిత్రం విజయవంతం కావాలని చిన్న కుమార్తె సౌందర్య ఇవాళ ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది...సౌందర్య రజనీకాంత్‌కు స్వాగతం పలికి, రాహుకేతు పూజలు చేయించారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. కాగా భారీ అంచనాల నడుమ అత్యంత అట్టహాసంగా విడుదల అవుతుందనుకున్న 'కబాలి' ఆడియో చాలా సాదా సీదాగా బయటకు వచ్చేసింది. శనివారం సాయంత్రం అత్యంత సాధారణంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యకు డిస్క్ ఇవ్వడం ద్వారా ఆడియోను విడుదల చేశారు. మరోవైపు సినిమా విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. -
రజనీ లేకుండానే కబాలి ఆడియో లాంచ్!
భారీ అంచనాల నడుమ అత్యంత అట్టహాసంగా విడుదల అవుతుందనుకున్న 'కబాలి' ఆడియో చాలా సాదా సీదాగా బయటకు వచ్చేసింది. శనివారం సాయంత్రం అత్యంత సాధారణంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యకు డిస్క్ ఇవ్వడం ద్వారా ఆడియోను విడుదల చేశారు. నిజానికి ఆదివారం ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. కానీ, రజనీకాంత్ ఇంకా అమెరికాలోనే ఉండటంతో ఆడియో విడుదలను వాయిదా వేసినట్లు కథనాలు వచ్చాయి. ఈలోపే.. 30 సెకండ్ల నిడివి ఉన్న ఆడియో క్లిప్ ఒకటి లీకైంది. ఈ నేపథ్యంలో అధికారికంగానే పాటలను విడుదల చేస్తే మంచిదని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు.. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముగించేసినట్లు తెలుస్తోంది. సినిమా ఆడియోను ఆదివారం విడుదల చేయాలనుకున్నా, అది మంచిరోజు కాదు కాబట్టి శనివారమే విడుదల చేసినట్లు చెబుతున్నారు. కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ సినిమాకు యువకుడైన సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. దాంతో ఈ సినిమా పాటలపై గట్టి అంచనాలే ఉన్నాయి. -
ఆయనకు ఆయనే సాటి: రాధికా ఆప్టే
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్లు ఎవరూ ఉండరని, ఆయనకు ఆయనే సాటి అని హీరోయిన్ రాధికా ఆప్టే విపరీతంగా పొగిడేసింది. కబాలి సినిమాలో రజనీ సరసన నటించిన ఈ బోల్డ్ నటి.. షూటింగ్ టైమ్‌లో తాను రజనీతో చాలా అద్భుతంగా గడిపినట్లు చెప్పింది. అది తన జీవితంలోనే అత్యుత్తమ అనుభవమని, అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపింది. ఆయన ఓ వండర్ఫుల్ మనిషని, ఆయనలా ఎవరూ ఉండనే ఉండరని రాధిక చెప్పింది. తాను నటించిన మరో సినిమా ఫోబియా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. కబాలి సినిమాలో రజనీకాంత్ డాన్ పాత్ర పోషిస్తుండగా, రాధికా ఆప్టే అతడి భార్య పాత్ర పోషిస్తోంది. రజనీ సరసన ఏవైనా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తారా అని అడగ్గా, బహుశా చేస్తానేమో.. చూడాలని తెలిపింది. మలేషియాలో కబాలి షూటింగ్ చాలా బాగా జరిగిందని, ప్రస్తుతం డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పింది. -
రజనీ మూవీలో లేడీ గ్యాంగ్‌స్టర్ ఎవరు?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ‘కబాలి’ సినిమాలో తమిళనటి ధన్సిక క్యారెక్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రజనీకాంత్ కూతురుగా నటిస్తున్న ధన్సిక గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషిస్తోందట. కూతురే ఆయన పాలిట విలన్‌గా, లేడీ డాన్‌గా అవతరిస్తుందట. తండ్రిని ఎదిరించే కూతురుగా, అతడితో విభేదిస్తూ.. సొంతముఠా ఏర్పాటుచేసుకుని గ్యాంగ్‌స్టర్‌గా అవతరిస్తుందని పేర్కొంది. సొంత తండ్రి వల్ల తీవ్రమైన సమస్యలకు గురైన పాత్రలో ఆమె ఒదిగిపోయిందని తెలిపారు. ఇంతవరకు ఆమె చేసిన పాత్రల కంటే ఇది చాలా భిన్నమైనదనీ... డిఫరెంట్ లుక్‌లో అలరిస్తుందన్నారు. దీనికోసం ఆమె చాలా కష్టపడి తన బాడీని పాత్రకు అనుగుణంగా మలుచుకుందని పేర్కొన్నారు. లింగ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రజినీ ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా కథ విషయానికి వస్తే రజనీకాంత్ ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా ఉండేవాడు. తదనంతర పరిణామాలతో ఆ పనులకు స్వస్తి పలికి కుటుంబానికి చేరువవుతాడు. అయితే ప్రత్యర్థులు ఆయనపై పగతో రజనీ కూతురు (ధన్సిక)ను కిడ్నాప్ చేస్తారు. దీంతో మళ్లీ రజనీ మాఫియా లీడర్‌గా అవతరించడం.. ఇలా ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుందీ కథనం. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తోంది. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ మూవీలో దినేష్, కలైశరన్, రిత్విక తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సీనిమా.. వేసవి సెలవుల సమయంలో థియేటర్లను పలకరించనుంది. చూడ్డానికి హీరోయిన్ అమలాపాల్ లా కనిపించే ఈ భామ తన హాట్ లుక్స్ తో తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. మరి ఈ సినిమాలోని సీరియస్ గెటప్‌లో ఎంతవరకు అలరించనుందో చూడాలి.