
ఆయనకు ఆయనే సాటి: రాధికా ఆప్టే
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్లు ఎవరూ ఉండరని, ఆయనకు ఆయనే సాటి అని హీరోయిన్ రాధికా ఆప్టే విపరీతంగా పొగిడేసింది. కబాలి సినిమాలో రజనీ సరసన నటించిన ఈ బోల్డ్ నటి.. షూటింగ్ టైమ్‌లో తాను రజనీతో చాలా అద్భుతంగా గడిపినట్లు చెప్పింది. అది తన జీవితంలోనే అత్యుత్తమ అనుభవమని, అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపింది. ఆయన ఓ వండర్‌ఫుల్ మనిషని, ఆయనలా ఎవరూ ఉండనే ఉండరని రాధిక చెప్పింది. తాను నటించిన మరో సినిమా ఫోబియా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది.
కబాలి సినిమాలో రజనీకాంత్ డాన్ పాత్ర పోషిస్తుండగా, రాధికా ఆప్టే అతడి భార్య పాత్ర పోషిస్తోంది. రజనీ సరసన ఏవైనా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తారా అని అడగ్గా, బహుశా చేస్తానేమో.. చూడాలని తెలిపింది. మలేషియాలో కబాలి షూటింగ్ చాలా బాగా జరిగిందని, ప్రస్తుతం డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పింది.