
తెల్లవారే 3 గంటల నుంచి.. అర్ధరాత్రి వరకు!
కబాలి సినిమాకు తమిళనాడులోను, ఇంకా మాట్లాడితే దక్షిణాది రాష్ట్రాల్లోను క్రేజ్ ఉందంటే చెప్పుకోవచ్చు. కానీ ముంబైలో ఓ థియేటర్ మాత్రం ఏకంగా దాదాపు రోజు మొత్తం అంటే ఇంచుమించు 24 గంటలూ కబాలి షోలను ప్రదర్శిస్తోంది. ముంబై మహానగరంలోని కింగ్స్ సర్కిల్లో ఉన్న 74 ఏళ్లనాటి అరోరా థియేటర్లో తెల్లవారుజామున 3 గంటలకు మొట్టమొదటి షో ప్రదర్శితం అవుతుంది. అప్పటి నుంచి వరుసగా ఉదయం 6 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు షోలు వేస్తున్నారు. మొత్తం అన్ని షోలకు సీట్లన్నీ బుక్ అయిపోయాయని థియేటర్ యజమాని నంబి రాజన్ చెప్పారు. ఆయన రజనీకాంత్ వీరాభిమాని.
అరోరా థియేటర్ నుంచి ఒక ఓపెన్ టాప్ బస్సులో సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారు. ఇది గత కొన్ని రోజులుగా నగరంలో పలు ప్రాంతాలు తిరుగుతూ రజనీ అభిమానులను అలరిస్తోంది. ముంబై సినీచరిత్రలోనే తొలిసారిగా రెండు భారీ కటౌట్లతో పాటు ఓ పెద్ద పోస్టర్ను కూడా థియేటర్ వద్ద పెడుతున్నారు. కబాలి సినిమా కోసం థియేటర్కు కొత్తగా రంగులు వేయించామని, కొత్త స్క్రీన్ పెట్టించామని, లైటింగ్ కూడా మార్పించామని రాజన్ చెప్పారు. మొదటి రోజు తర్వాత మాత్రం ప్రతిరోజు లాగే నాలుగు ఆటలు ప్రదర్శిస్తారు. దీనికి కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే పూర్తయింది.
ముంబైలోని రామమందిరంలో శుక్రవారం నాడు రజనీ అభిమానులు భారీప్రదర్శనగా వెళ్లి ప్రత్యక పూజలు చేయిస్తున్నారు. నగరంలోని ప్రముఖ కంటివైద్య నిపుణుడు, రజనీ వీరాభిమాని అయిన ఎస్. నటరాజన్ అయితే.. ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నగరవ్యాప్తంగా పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఉంటాయి.