సూపర్ స్టార్ @ 66
సినీకళామతల్లికి అత్యంత ప్రియమైన బిడ్డల్లో మన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మ ఒడికి చేరడానికి ఆదిలో ఎంత కష్టపడ్డారో, ఇప్పుడు అంతగా ఇష్టుడయ్యారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సినీకళామతల్లి ఒడిలో అన్న చందాన, కర్ణాటక రాష్ట్రం, బెంగళూర్‌లో శివాజీరావ్ గైక్వాడ్‌గా పుట్టి, ఇక బస్సు కండక్టర్‌గా పెరిగి రజనీకాంత్‌గా రూపాంతరం చెంది ప్రపంచ సినీ స్టార్‌గా ఎదిగిన ఈయన గురించి రాయడానికి పేజీలు, చెప్పడానికి మాటలు చాలవు. 1975లో అపూర్వరాగంగళ్ చిత్రం ద్వారా నటుడిగా పుట్టిన రజనీకాంత్ నట వయసు 41.
అయితే 1950 శివాజీ గైక్వాడ్‌గా జన్మించిన ఆయన 66వ ఏట అడుగుపెట్టారు. సోమవారం సూపర్‌స్టార్ పుట్టిన రోజు. భారతీయ సినీరంగంలో, సుమారు నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా ఏలుతున్న ఏకై క నటుడు రజనీకాంత్ అని పేర్కొనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం కలిగిన రజనీకాంత్‌ను పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి భారత ప్రభుత్వ అవార్డులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. ఇటీవలే ఆయన విశేషనట సేవలకుగానూ సెంటనరీ అవార్డు అలంకారమైంది.
ఇక కలెక్షన్ల పరంగా రజనీకాంత్ చిత్రాలు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి. 2006లోనే శివాజి చిత్రంతో రూ. 26 కోట్ల లాభాలను ఆర్జించి ఆసియాలోనే జాకీచాన్ తరువాత అత్యధిక వసూళ్లను సాధించిన నటుడిగా వాసికెక్కారు. ఇటీవల రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం అంతకు ముందున్న బాక్సాఫీస్ రికార్డులను చించేసింది. తాజాగా సూపర్‌స్టార్ నటిస్తున్న 2.ఓ చిత్రం 400 వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతూ అత్యధిక బడ్జెట్‌లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కనుంది.తీరని కోరిక: నిరాడంబరుడు, నిగర్వి అరుున రజనీకాంత్‌కు తీరని కోరిక అంటూ ఏమీ ఉండదు. అయితే ఆయన అభిమానులకు మాత్రం ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలన్నది చిరకాల వాంఛ. మరి వారి కోరికను సూపర్‌స్టార్ నెరవేరుస్తారో? లేదో? వేచి చూడాల్సిందే.
పుట్టిన రోజు వేడుకకు దూరం: రజనీకాంత్ ప్రతి పుట్టిన రోజున తన అభిమానులను కలుసుకుని వారి అభిప్రాయాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అభిమానులైతే పూజలు, కటౌట్‌లకు పాలాభిషేకాలు, అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాంటిది ఈ సారి జయలలిత కన్నుమూయడంతో తన పుట్టిన రోజు వేడుకకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులకు కూడా ముందుగానే విజ్ఞప్తి చేశారన్నది గమనార్హం.