బుల్లితెర అంటే కొందరికి ఇప్పటికీ చిన్న చూపే అని నిస్పందేహంగా చెప్పవచ్చు. అయితే కళాకారులుగా సాధించాలనుకునే వారికి ఆరంభంలోనూ, అంతిమంలోనూ చాలా మందికి జీవితాన్నిచ్చేది బుల్లితెరనే అన్నది వాస్తవం. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో చాలా మంది బుల్లితెర నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ వరుసలో ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా ఉన్నారన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. మధ్యతగతి కుటుంబానికి చెందిన ఈ కేరళాకుట్టికి చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి అట.
దీంతో ఆమె బంధువు ఒకరు సినీ రంగంలో పని చేస్తుండడంతో ఆయన ద్వారా తన పొటోలను కొందరు సినీ దర్శక, నిర్మాతలకు చేరాయి. అయితే నటినవ్వాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి బుల్లితెరను మార్గంగా చేసుకున్నారు. అలా టీవీ యాంకర్‌గా తన పయనాన్ని ప్రారంభించి సినిమా వాళ్ల దృష్టిలో పడ్డారు.
అలా 2005లో తమిళంలో అయ్యా అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే సుప్రీమ్‌స్టార్ శరత్‌కుమార్‌కు జంటగా నటించి విజయాన్ని అందుకున్న నయనతార రెండో చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకున్నారు. ఆ తరువాత వరుసగా అవకాశాలు తలపుతట్టడంతో కథానాయకిగా 20 ఏళ్ల పాటు లేడీసూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నారు. ఇటీవల ఒక భేటీలో నయనతార పేర్కొంటూ తన జీవిత చక్రం సినీ రంగప్రవేశం చేసిన తరువాత తలకిందులైందన్నారు.
ఏదో ఒక రోజు తాను ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదన్నారు. అదే విధంగా తన జీవిత లక్ష్యం గురించి చెబుతూ బీకామ్ పట్టభద్రురాలైన తాను చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) అవ్వాలని ఆశ పడ్డానన్నారు. తాను నటి కాకుంటే కచ్చితంగా సీఏ అయ్యి ఉండేదానినని తన బంధువులతో చెబుతుండేదానినని అన్నారు. అయితే నయనతార సీఏ కావాలన్న కోరిక నెరవేరకున్నా ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.
Comments
Please login to add a commentAdd a comment