మొదటి రోజే వంద కోట్లు! | 'Kabali' has created all time history across globe, says Producer | Sakshi
Sakshi News home page

మొదటి రోజే వంద కోట్లు!

Published Sat, Jul 23 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

మొదటి రోజే వంద కోట్లు!

మొదటి రోజే వంద కోట్లు!

బాలీవుడ్ సినిమాలు ఏవైనా వందకోట్ల కలెక్షన్ రావాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. కానీ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఆ ఫీట్ను ఒక్కటంటే ఒక్కరోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సినిమా కలెక్షన్లు ఎంతో అధికారికంగా ఇంకా రావాల్సి ఉందని, కానీ మొదటిరోజు ఎంతలేదన్నా కనీసం రూ. 100 కోట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేవుడి దయతో సినిమా బాగా ఆడుతోందని చెప్పారు.

భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా కలెక్షన్లు బాగున్నట్లు కలైపులి తెలిపారు. సినిమా విషయంలో భాష ఎప్పుడూ సమస్య కాబోదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్లలో సినిమా విడుదలైందని, అమెరికాలో 480, మలేసియాలో 490, గల్ఫ్ దేశాల్లో 500 స్క్రీన్లలోను సినిమా విడుదలైనట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ నటుడికీ ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్లు రాలేదని, దాన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద సూపర్ స్టార్ ఒకరేనని, ఆయన రజనీకాంతేనని అన్నారు. సంఘ వ్యతిరేక శక్తుల వల్ల పైరసీ భూతాన్ని అడ్డుకోవడం కష్టం అవుతోందని కలైపులి ఎస్ థాను ఆవేదన వ్యక్తం చేశారు.

1978లో రజనీకాంత్ నటించిన భైరవి సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించినప్పుడు ఆయనను కలైపులి ఎస్. థాను తొలిసారి కలిశారు. 1984లో నిర్మాతగా మారి అర్జున్ నటించిన యార్ సినిమా నిర్మించారు. రజనీకాంత్ ఆ సినిమాలో అతిథిపాత్ర పోషించారు. అప్పటినుంచి రజనీ తనకు బాగా సన్నిహితుడయ్యారని, 32 ఏళ్లుగా ఆయనతో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నానని అన్నారు. కొచ్చాడయాన్, లింగా సినిమాలు ఫ్లాప్ కావడంపై ప్రశ్నించగా.. కొచ్చాడయాన్లో రజనీ నటించలేదని.. కేవలం ఆయన గొంతు మాత్రమే ఉంటుందని అన్నారు. ఇక లింగాపై రకరకాల రూమర్లు వచ్చినా.. ఆ సినిమా రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement