జీవితంలో ఒక్క యాడ్ కూడా చేయని హీరో! | Rajinikanth never endorsed a single brand in his life time | Sakshi
Sakshi News home page

జీవితంలో ఒక్క యాడ్ కూడా చేయని హీరో!

Published Fri, Jul 22 2016 10:18 AM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

జీవితంలో ఒక్క యాడ్ కూడా చేయని హీరో!

జీవితంలో ఒక్క యాడ్ కూడా చేయని హీరో!

టాలీవుడ్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, అఖిల్.. ఇలా చాలామంది ప్రకటనలలో కనిపిస్తారు. ఫలానా బ్రాండ్ అంటే తమకిష్టమని చెబుతారు. కేరళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్లు సబ్బులు, నగలు, బ్యాంకులు, చివరకు కూరల్లో వేసే మసాలా ప్రకటనలలో కూడా కనిపిస్తారు. కన్నడంలో పునీత్ రాజ్కుమార్, శివరాజ్ కుమార్ లాంటివాళ్లు పాలు, నగల బ్రాండ్లకు ప్రకటనలలో నటిస్తారు. తమిళనాడులో కమలహాసన్ లాంటి వాళ్లు సైతం ఈ మధ్యనే ప్రకటనలలో కనిపించారు. అయితే, ఒక వస్త్ర కంపెనీ ప్రకటనలో నటించగా వచ్చిన రూ. 16 కోట్లను హెచ్ఐవీ బాధిత పిల్లల కోసం కమల్ విరాళంగా ఇచ్చేశారట.

ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. కబాలి సినిమాతో అంతర్జాతీయంగా కూడా బాక్సాఫీసులను షేక్ చేస్తున్న సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రకటనలో కూడా నటించలేదు. సినిమాలు తప్ప ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. 42 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించిన రజనీ కాంత్ ఒక్క కనుసైగ చేస్తే చాలు.. ఆలిండియా టాప్ బ్రాండ్లు అన్నీ ఆయన కాళ్ల ముందు వాలిపోతాయి. కోట్లకు కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతాయి.

గత కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ ఖాన్ల త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లతో పాటు అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు కూడా ప్రకటనలలో నటించిన కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించారు. కానీ రజనీ మాత్రం తన కెరీర్ ఎంత పీక్ స్థాయిలో ఉన్నా, వరుసగా ఫ్లాప్లు చూసినా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రకటనలను ఆశ్రయించలేదు. రెండు కోట్లకు పైగా ఇస్తామంటూ ఓ కోలా కంపెనీ రజనీ వద్దకు ఆఫర్ తీసుకెళ్దామని చూస్తే.. తలైవా వాళ్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. రజనీ గుడ్విల్ ఏ కార్పొరేట్ బ్రాండ్ కంటే చూసినా చాలా ఎక్కువని, దేశంలోని ఏ నాయకుడి కన్నా, కార్పొరేట్ లీడర్ల కన్నా ఆయనకు ఎక్కువ విలువ ఉందని.. దాన్ని ఎవరూ డబ్బుతో కొలవలేరని ముంబైకి చెందిన బ్రాండ్ ఎండార్సర్ అనిర్బన్ బ్లా చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement