
నాన్నకు ప్రేమతో.. ఆ సినిమా చేయించా!
రేపు.. అంటే ఆదివారం ఫాదర్స్ డే. వేలు పట్టి నడిపించిన తండ్రి కోసం పిల్లలు ఏమైనా చేస్తారు. అదే సెలబ్రిటీల పిల్లలైతే.. మరికొంచెం ఎక్కువగా చేసి తండ్రికి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మరి ఆలిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఏం చేసింది? నాన్నకు ప్రేమతో.. ఓ సినిమా చేయిస్తోంది. ఆ సినిమా టీజర్ దగ్గర నుంచి పాటల వరకు ప్రతి ఒక్కటీ యూట్యూబ్‌లో సంచలనాలు రేపుతున్నాయి. అవును.. రజనీకాంత్ కూతురు సౌందర్య పూనుకోవడం వల్లే కబాలి సినిమా వస్తోంది. ఈ విషయం ఇంతవరకు బయటపడలేదు. తాజాగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ సినిమా వెనక కథ చెప్పింది.
వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్‌గా చేసే రోజుల నుంచి పా రంజిత్ ఎవరో సౌందర్యకు తెలుసు. నిజానికి రంజిత్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అట్టకత్తికి సౌందర్యే నిర్మాత కావాలి గానీ కుదరలేదు. ఒకరోజు తండ్రీ కూతుళ్లు మాట్లాడుకుంటుండగా.. రంజిత్ తీసిన 'మద్రాస్' సినిమా ప్రస్తావన వచ్చింది. అది చాలా బాగుందని రజనీ అన్నారు. తర్వాత రంజిత్‌ను సౌందర్య కలిసినప్పుడు, 'నాన్న కోసం ఓ సినిమా కథ చెబుతావా' అని అడిగేసరికి ఆయన షాకయ్యాడు. కొన్ని రోజులు ఆగి స్టోరీ లైన్ చెప్పాడు. 'ఆయనో మలేషియన్ డాన్' అన్నాడు.. అంతే, అదే లైను గురించి రజనీకి సౌందర్య చెప్పారు. ఆయనకు అది వెంటనే నచ్చి, ఓకే అనేశారు.
కలైపులి ఎస్.థానుకు స్వయంగా ఫోన్ చేసి, ఈ సినిమాను నిర్మించాలని అడిగారు. ఎప్పుడో తీసిన భైరవి సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు రాలేదు. ఇది ఏకంగా రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నది కావడంతో కలైపులినే నిర్మాతగా రజనీ ఎంచుకున్నారు. ఇందులో రజనీకాంత్ కబాలీశ్వరన్ అనే ముసలి డాన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన భార్య కుందనవల్లిగా రాధికా ఆప్టే నటిస్తోంది. ఒకప్పుడు తాను ఏలిన, తాను ఎంతగానో ప్రేమించే చెన్నై నగరానికి మలేషియన్ డాన్ కబాలి తిరిగి రావడం, ఇక్కడ మళ్లీ రాజ్యమేలడం లాంటివి ఈ సినిమా ప్రధానాంశాలని తెలుస్తోంది.