
రజనీ లుక్స్ వెనక సీక్రెట్ ఏంటో తెలుసా?
ఎప్పటికప్పుడు తన సరికొత్త లుక్తో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు రజనీకాంత్. ఎక్కడో బెంగళూరులో బస్సు కండక్టర్గా ఉండే శివాజీరావు గైక్వాడ్ ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడం, ఇన్ని వందల కోట్ల కలెక్షన్లు సాధించడం.. ఇదంతా నిజానికి వండరే. ఒక్క భారతదేశంలోనే కాక.. ఆసియా ఖండంలో ఉన్న అన్నిదేశాల్లోనూ కబాలి విడుదల అవుతోంది. దీన్ని బట్టే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతలా విస్తరించిందో తెలుస్తుంది. రజనీకాంత్ కొత్త సినిమా విడుదల అయిన ప్రతిసారీ ఆ పేరుతో చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని న్యూ నీలాభవన్ హోటల్లో కొత్త మెనూ వస్తుంది. రాజాధి రాజా దోశ, దళపతి పరోటా, నరసింహ సురుట‍్టు పరోటా, రోబో నూడుల్స్.. ఇలా చాలానే ఉన్నాయి.
ఆయన డైలాగులలో పంచ్ పవర్ ఎప్పటికప్పుడు పెరుగుతుంది తప్ప తగ్గదు. ‘ఇది ఎలా ఉంది’ అంటూ ప్రతిసారీ రజనీ కొత్త స్టైల్ చూపిస్తుంటారు. ఆయన స్టైల్ స్టేట్మెంటును అనుకరించేందుకు చాలామంది ప్రయత్నించినా.. అది కాపీలాగే కనిపిస్తుంది తప్ప ఏమాత్రం ఒరిజినల్ లుక్ ఉండదు. మరి 65 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ రజనీ అంత చురుగ్గా, చలాకీగా ఎలా ఉండగలుగుతున్నారు? కబాలి సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకోడానికి మీడియా ప్రయత్నించింది. ఆహారం విషయంలో కచ్చితంగా ఉండటం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్లే ఇది సాధ్యమవుతోందని రజనీ గతంలో చెప్పారు.
2008 సంవత్సరంలో కుచేలన్ సినిమా ఆడియో ఆవిష్కరణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చక్కెర, అన్నం, పాలు, పెరుగు, నెయ్యి.. ఇవన్నీ వదిలేశానని, ముఖ్యంగా 40 తర్వాత వీటిని వదిలేస్తే ఎవరైనా యంగ్ లుక్తోనే ఉంటారని తెలిపారు. ఉదయం 5 గంటలకే లేచి గంట సేపు జాగింగ్ చేస్తానని, సాయంత్రం ఊకడా కాసేపు నడిచి, ప్రతిరోజూ ధ్యానం తప్పనిసరిగా చేస్తానని అన్నారు. యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ముఖంలో మెరుపు వస్తుందన్నారు. రాత్రిపూట బాగా పడుకోవాలని కూడా ఆయన తెలిపారు. ప్రతిసారీ సినిమా విడుదలైన తర్వాత హిమాలయాలకు కూడా వెళ్లి వస్తుంటారు.