
వస్తారు కానీ... స్టెప్పులు వేయరట
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించే 'సంగీత్' కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టెప్పులు వేస్తారంటూ మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. అయితే మంచు వారి వివాహ వేడుకల్లో రజనీ మాత్రం స్టెప్పులు వేయరంటా. ఇదే విషయాన్ని హీరో మోహన్ బాబు కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు వెల్లడించారు. ఇవన్నీ వట్టి పుకార్లు అంటూ కొట్టి పారేశారు.
రజనీ, మోహన్బాబు మంచి స్నేహితులు ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ వివాహ వేడుకలకు రజనీ హజరవుతారు. కానీ ఆయన స్టెప్పులు మాత్రం వేయరన్నారు. ఇదే విషయంపై రజనీకి అత్యంత సన్నిహితులు కూడా స్పందించారు. రజనీ తన ఇద్దరు కుమార్తెల వివాహం జరిగిన సమయంలోనే ఆయన స్టెప్పులు వెయ్యలేదన్న సంగతి వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం మే 20వ తేదీన హైదరాబాద్లో జరగనుంది. ఈ నేపథ్యంలో మంచు వారి వివాహనికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ వివాహ వేడుకలు మే 14 వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శంషాబాద్లోని మోహన్ బాబు నివాసంలో ఈ 'సంగీత్' వేడుకకు వేదిక కానుంది. వరుసగా ఐదు రోజులపాటు ధూమ్ ధామ్గా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిలో ప్రతిరోజు 'సంగీత్' ఉంటుంది.