కోచ్చడయాన్ మళ్లీ వాయిదా?
కోచ్చడయాన్ మళ్లీ వాయిదా?
Published Fri, Mar 7 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
కోచ్చడయాన్ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నా తాజా చిత్రం కోచ్చడయాన్. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో త్రీడీ ఫార్మెట్‌లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్, శరత్ కుమార్, ఆది, శోభన తదితర ప్రముఖ తారలు నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య అశ్విన్ దర్శకురాలు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, పంజాబి, గుజరాతి, జపనీస్, ఫ్రెంచ్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆరు వేల థియేటర్లలో ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల తొమ్మిదిన చిత్ర గీతాలు, ప్రచార చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు చిత్ర విడుదల వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడమే. ఏప్రిల్ 24న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ చిత్రం విడుదలకు చిక్కొచ్చిపడింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరగనుండడంతో కోచ్చడయాన్ చిత్రాన్ని విడుదల చేయడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికలనంతరం అంటే మే నెలకు చిత్ర విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటుడు విశాల్ నిర్మిస్తూ నటిస్తున్న నాన్ శివప్పు మనిదన్, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మాన్ కరాటే చిత్రాల విడుదల వాయిదా పడనున్నాయి. మొత్తం మీద భారీ చిత్రాలు ఏప్రిల్లో లేనట్లేనని సమాచారం.
Advertisement