ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడిన విషయం విదితమే. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారితో ఎలా పోరాడారో, దానిని ఎలా అధిగమించారో చెప్పుకొచ్చారు. ‘ఇదంతా ఎలా జరిగిందో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. నొప్పి లేదు, దురద లేదు.. ఇది చాలా చిన్న విషయం అనుకున్నాను. ఓ రోజు ముంబైలోని హిందూజ హాస్పిటల్‌కు నా స్నేహితుడిని కలవడానికి వెళ్లినప్పుడు.. తనతో మాట్లాడుకుంటూ అక్కడి ఆవరణంలో నడుస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఈఎన్‌టీ సర్జన్ బోర్డు చూసి డాక్టర్ క్యాబిన్‌కు వెళ్లాను. ఆ డాక్టర్ నన్ను పరీక్షించి ‘బయాప్సీ’ పరీక్ష చేయించుకొమని సలహా ఇచ్చారు. డాక్టర్ ఎందుకు ఆ పరీక్ష చేయించుకొమ్మన్నారో నాకు తెలియదు కానీ.. నేను కాన్సర్ బారిన పడిన సంగతి నాకు కొంత అర్ధమైంది. ఆ తర్వాత నేను హృతిక్ రోషన్(నా తనయుడు) వద్ద ఉన్న సమయంలో(15 డిసెంబర్2018 ) రోజున పరీక్షలో బయాప్పీ పాజిటివ్ వచ్చిందని ఫోన్ వచ్చింది’ అని పేర్కొన్నారు.
అలాగే తన కుటుంబం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ఈ విషయం వారిని కదిలించలేదని రాకేష్ రోషన్ పేర్కొన్నారు. కాగా ‘కాన్సర్ చికత్సలో భాగంగా నా నాలుకను కత్తిరించాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పినప్పుడు నేను కాస్త భయపడి మొదట నిరాకరించాను. ఆ తర్వాత కాన్సర్ కణాలు ఉన్న నా నాలుక భాగాన్ని కత్తిరించారు. ఆ తర్వాత మూడు నెలల పాటు నీళ్లు, టీ, కాఫీలాంటివి తాగలేక పోయాను. కొన్నిసార్లు నాలుకలోని రుచి కణాలు కూడా సరిగా పని చేయక వివిధ రుచులను ఇచ్చేవి. ఈ మూడు నెలల్లో నేను దాదాపు 10 కిలోల బరువు తగ్గాను, అయితే మళ్లీ 3 కేజీ బరువు పెరిగాను. ఇప్పుడు రోజు 90 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నా. పూర్తి ఆరోగ్యవంతంగా మారటానికి మరో ఆరు నెలల సమయం పడుతుందేమో’ అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment