సెన్సార్ బోర్డుపై హీరోయిన్ చిందులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ ఐటమ్ గర్ల్, నటి రాఖీ సావంత్ కేంద్ర సెన్సార్ బోర్డుపై విరుచుకుపడింది. రాఖీ తాజా సినిమా ఏక్ కహాని జూలీ కీ.. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఆమెకు కోపం తెప్పించింది. సెన్సార్ బోర్డుపై, చైర్మన్ పహ్లజ్ నిహలానీపై రాఖీ తీవ్ర విమర్శలు చేసింది.
‘సెన్సార్ బోర్డును మూసివేయాలి. పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వాళ్లు చేస్తున్నదేమీ లేదు. సెన్సార్ బోర్డు సభ్యులు చిన్న నిర్మాతలను వేధిస్తున్నారు. లంచం ఇవ్వాలని పబ్లిక్గా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఏమీ తెలియనివారు ఉన్నారు. సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి నుంచి నిహలానీని తప్పించాలి. ఆయనకు ఏమీ తెలియకుంటే పదవికి రాజీనామా చేయాలి. ఆ స్థానంలో నేను కూర్చుంటాను. నిహలానీ కంటే సమర్థవంతంగా పనిచేయగలను. వాళ్లకు మేం డబ్బులు ఇవ్వనందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో నటించడమే దీనికి కారణం. వాళ్లు బుద్ధి కోల్పోయారు. నేను బాలీవుడ్ స్టార్ను, నటిని, ఈ దేశ బిడ్డను. నేనేమీ పోర్న్ స్టార్ కాదు. ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఈ సినిమాలో అసభ్య దృశ్యాలు లేవు. ఈ విషయంపై బాంబే హైకోర్టును సంప్రదించాను. సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని కోరాను. వాళ్లకు తగిన గుణపాఠం చెబుతా. వారిపై పోరాటం చేస్తాను. దేశంలో సెన్సార్ బోర్డు లేకుండా తొలగించాలి’ అని రాఖీ ఘాటుగా విమర్శించింది.