‘నేను ధూమపానం, మద్యపానం చేయను. కేవలం అవి అవంతిక(మన్మథుడు 2లో తన పాత్ర) అలవాట్లు! ఇది నటనలో భాగం. అవి రెండు ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. అటువంటి అలవాట్లను మన్మథుడు 2 ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. నా ఇంటర్వ్యూలో ఉన్న అసలు విషయాన్ని వదిలేసి వేరే విషయాలు ఎందుకు రాస్తారో నాకు అస్సలు అర్థం కాదు’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఇంటర్వ్యూలో కొంతభాగాన్ని హైలెట్ చేస్తున్నారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక క్లిప్పింగ్‌ను ట్విటర్‌లో చేశారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రకుల్.. అవంతిక అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రకుల్ పోషించిన అవంతిక పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సిగరెట్ కాలుస్తూ బోల్డ్ డైలాగ్స్ చెప్పిన రకుల్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో తాజాగా రకుల్ మాట్లాడుతూ...‘ సినిమాను సినిమాలా చూసే ఆలోచనా ధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్ కాల్చింది నేను కాదు.. అవంతిక (ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు). సిగరెట్ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. సినిమాలో కూడా ఇవి రెండు మూడు షాట్స్ మాత్రమే ఉంటాయి. నా నిజ జీవితంలో నేను సిగరెట్ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు. అదే సినిమాలో హీరోయిన్ సిగరెట్ కాల్చితే అదో పెద్ద టాపిక్. సినిమాలో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే క్యాషన్ కూడా వేస్తుంటాం కదా’’ అని పేర్కొన్నారు. అదే విధంగా సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో...‘ సిగరెట్ కాల్చడం చాలా సాధారణ విషయం. మనం రోడ్డు మీద వెళ్తున్నపుడు కొంతమంది ఇలాంటి పనులు చేస్తే అస్సలు పట్టించుకోము. అదే తెరపై నటులు చేస్తే మాత్రం తప్పుగా చూస్తాం’ అని రకుల్ అన్నట్లుగా సదరు పత్రిక రాయడంతో ట్విటర్ వేదికగా ఆమె అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment