నాగార్జున, పి.కిరణ్, రకుల్ ప్రీత్‌సింగ్, నాగచైతన్య, రాహుల్ రవీంద్రన్
‘‘నాకు వయసు గురించి మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు.. ఇప్పుడు నేను ఓ ప్రేమకథ చేయడం ఏంటని చాలామంది అడిగారు. ఏడాది క్రితం ఓ ఫ్రెంచ్ సినిమా చూపించారు. నిజంగా ఇప్పుడు నా వయసుకు తగ్గ సినిమా, నాకు బాగా సరిపోతుందనిపించింది. ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు.. రొమాన్స్ చేయొచ్చని చూపించే సినిమా ఇది. ఏ వయసులోనైనా ముద్దు పెట్టుకోవచ్చు కూడా.. నో ప్రాబ్లమ్.. అలా ‘మన్మథుడు 2’ మొదలైంది. నాకు ఇద్దరు పిల్లలున్నారు అంటున్నారు.
కానీ, వాళ్లు నాకు బ్రదర్స్.. నో సన్స్’’ అని నాగార్జున అన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ‘మన్మథుడు 2 డైరీస్’ పేరుతో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాకు చాలా ఇష్టమైన నెల ఈ ఆగస్టు. మొన్ననే ‘బిగ్‌బాస్ 3’ స్టార్ట్ అయింది. 9న ‘మన్మథుడు 2’ విడుదలవుతోంది.
ఈ నెలాఖరుకు నాకు 30ఏళ్లు నిండుతాయి(నవ్వుతూ). ముప్పై ఏళ్లే కదా! ఈ సినిమాకి ‘మన్మథుడు 2’ టైటిల్ ఎందుకు పెట్టామంటే.. ఒరిజినల్ ‘మన్మథుడు’.. హి హేట్స్ ఉమన్.. మరి ఆ సర్కిల్‌ని పూర్తి చేయాలి కదా.. హి లవ్స్ ఉమెన్ ‘మన్మథుడు 2’.. అందుకే పెట్టాం. ‘మన్మథుడు’ నాకు, మీకు ఎంతో ఇష్టమైన సినిమా. దాని అసలైన సృష్టికర్త విజయ్‌భాస్కర్‌గారు ఇక్కడే ఉన్నారు. ‘మన్మథుడు 2’ ఫంక్షన్‌కి రమ్మని ఆయనకి ఫోన్ చేసినప్పుడు భార్యతో కలిసి బ్యాంకాక్‌లో ఉన్నట్టున్నారు.. వస్తున్నానని చెబుతూనే, ‘మన్మథుడు 2’ టీజర్ చూశా.. చాలా వేడివేడిగా ఉందన్నారు.
ఇక్కడికొచ్చినందుకు దేవిశ్రీకి థ్యాంక్స్. నన్ను అందంగా చూపించినందుకు సుకుమార్‌కి థ్యాంక్స్. రకుల్‌తో పనిచేయడం చాలా సులభం.. తనలో చాలా ప్రతిభ ఉంది.. బాగా కష్టపడుతుంది. ఆరోగ్యం గురించి తనవద్ద చాలా నేర్చుకోవచ్చు. రాహుల్ అద్భుతమైన దర్శకుడు.. నేను మీకు ఈరోజు మాట ఇస్తున్నా. సినిమా మొదలైనప్పటి నుంచి లాస్ట్ వరకూ పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంటారు.. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి ‘మన్మథుడు’ లా నవ్వుకుని వెళ్లొచ్చు.. ఇందుకు నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఈ వేసవికి మా పెద్దబ్బాయి (నాగచైతన్య) ‘మజిలీ’ సినిమాతో మీ ముందుకొచ్చాడు. మొన్న ‘ఓ బేబీ’ అంటూ నా కోడలు (సమంత) వచ్చింది. ఆగస్టు 9న ఆ రెండూ ఔట్... నేను వస్తున్నా (నవ్వుతూ)’’ అన్నారు.
డైరెక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘మన్మథుడు’ నాకు మరచిపోలేని అనుభూతినిచ్చింది. అన్నపూర్ణలో పనిచేయాలంటే అదృష్టం ఉండాలి. ‘మన్మథుడు’ వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ ఆ సినిమా ఫ్రెష్ లవ్‌స్టోరీగానే అనిపిస్తోంది ’’ అన్నారు.
హీరో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిజంగా చెప్పాలంటే ఈ మధ్య నాన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందేమో అందరూ మీరు బ్రదర్స్‌లా ఉన్నారని కామెంట్ చేసేవాళ్లు. సరే బ్రదర్సే కదా లుక్స్‌తో ఏదో మేనేజ్ చేయొచ్చులే అనిపించింది. కానీ, ఇప్పుడు కథలు కూడా అలాంటివే ఎంచుకుంటున్నారు నాన్న. ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీ కెరీర్‌లో ఒక ప్రేమకథని ఫ్రెష్‌గా చూపిస్తున్నారంటే రియల్లీ అమేజింగ్.
మాకు ఒక్క హిట్ వస్తే అదే జోనర్‌లో మరో రెండు సినిమాలు సేఫ్‌గా చేద్దామనుకుంటాం.. ఫ్లాప్ వచ్చిందంటే ఇంకొంచెం జాగ్రత్తగా కథలు ఎంచుకోవాలనుకుంటాం. కానీ, నాన్నగారు అలాకాదు.. హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ప్రతి అడుగు ధైర్యంగా వేస్తారు.. అందుకే ఆయన ‘కింగ్’ అయ్యారు.. అందుకే మాకు ఆయన చాలా స్ఫూర్తి. ‘చి.ల.సౌ’ చూడగానే అన్నపూర్ణలో రాహుల్‌తో ఓ సినిమా చేద్దామని నాన్నకు చెప్పాను.. తనతో త్వరలోనే పనిచేయాలనుకుంటున్నా’’ అన్నారు.
‘‘నాగేశ్వరరావుగారితో, నాగార్జున గారితో, నాగ్ అబ్బాయి నాగచైతన్యతో నటించాను. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఈ మూడు జనరేషన్స్‌తో పనిచేశా’’ అన్నారు సీనియర్ నటి లక్ష్మి . ‘‘చి.ల.సౌ’ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నాగ్‌సార్ ఇంటికి పిలిచారు. ఓ ఫ్రెంచ్ సినిమా చూశా.. రీమేక్ చేద్దామనుకుంటున్నా. నవ్వు కరెక్ట్ అనిపించింది.. నాతో సినిమా చేస్తావా? అనగానే షాక్ అయిపోయా.. చాలా సంతోషంగా ఫీలై చేస్తాను సర్ అన్నాను’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ‘‘తెలుగులో నాకు ఇప్పటి వరకూ అవంతిక లాంటి పాత్ర చేసే అవకాశం రాలేదు. ఇందుకు రాహుల్‌కి థ్యాంక్స్’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. నిర్మాత పి.కిరణ్, కెమెరామేన్ సుకుమార్, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, నటి అమల, హీరో సుశాంత్, నిర్మాత నాగసుశీల, నటీనటులు ఝాన్సీ, దేవదర్శిని, ‘వెన్నెల’ కిశోర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయని చిన్మయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment