తెర పైకి చిన్నమ్మ
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర’కు రాయలసీమ ఫ్యాక్షన్, ఈ నెల 23న విడుదల కానున్న ‘వంగవీటి’కి విజయవాడ రౌడీ రాజకీయ చరిత్రలు కథావస్తువులు అయ్యాయి. ఇప్పుడీయన కన్ను తమిళ రాజకీయాలపై పడింది. అమ్మ (జయలలిత) మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, చిన్నమ్మ శశికళకు ప్రాధాన్యం పెరగడం తెలిసిందే. ఇప్పుడు వర్మ సినిమాకు శశికళ కథావస్తువు అయ్యారు. ఓ రాజకీయ నాయకురాలికి సన్నిహిత స్నేహితురాలి కథతో ‘శశికళ’ అనే సినిమా తీస్తున్నట్టు వర్మ ప్రకటించారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించానని చెప్పారు. వాస్తవ సంఘటనలతో వర్మ తీసిన ‘రక్త చరిత్ర’, ‘ద ఎటాక్స్ ఆఫ్ 26/11’ సినిమాలు ప్రకంపనలు సృష్టించాయి. తాజా ‘వంగవీటి’ కూడా సంచలనంగా మారింది. బహుశా.. అవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టున్నారు.
అందుకే కల్పిత కథతో ‘శశికళ’ తీయనున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘జయలలిత తన కళ్లతో కన్నా శశికళ కళ్లతోనే ఈ లోకాన్ని కవితాత్మకంగా చూశారు. ఈ లోకంలో అందరి కంటే ఎక్కువగా శశికళను గౌరవించారు. రాజకీయాలతో సంబంధం లేని శశికళ కల్పిత కథే ఈ సినిమా’’ అని వర్మ సోషల్ మీడియాలో తెలిపారు. జయలలిత, శశికళల మధ్య సన్నిహిత సంబంధానికి చిహ్నమంటూ పైన ఇన్‌సెట్‌లో కనిపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. మరి, వర్మ సినిమాలో అంతా మంచే చూపిస్తారో? లేదా శశికళపై వస్తోన్న విమర్శలను కూడా ప్రస్తావిస్తారో? వెయిట్ అండ్ సీ!!