
‘‘పుట్టినరోజంటే నాకు చాలా చిరాకు. చావుకు ఒక సంవత్సరం దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది. మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే.. అది సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ అర్థం ఉంటుందని నా అభిప్రాయం’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రం ద్వారా రామ్‌గోపాల్ వర్మ నటుడిగా మారారు. ‘ఆర్జీవీ గన్ షాట్ ప్రొడక్షన్స్’ పతాకంపై డి.పి.ఆర్. నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం వర్మ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘ఈ సంవత్సరం ఎందుకు పుట్టినరోజు చేసుకుంటున్నానంటే ఈ రోజు నేను నటుడిగా పుట్టాను. ‘కోబ్రా’ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఇంటెలిజిన్స్ ఆఫీసర్ పాత్ర లో నేనే నటిస్తే బాగుంటుందనుకున్నాను.
ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ‘కోబ్రా’ సినిమాతో ఆర్జీవీ గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. 29 ఏళ్ల తర్వాత మళ్లీ నేను, కీరవాణిగారు ‘కోబ్రా’ సినిమా కోసం కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి మాట్లాడుతూ – ‘‘వర్మగారు మంచి మ్యూజిక్ లవర్. ఆయన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవటం అనూహ్యం. ఇలాంటి మార్పులు ఈ ‘కోబ్రా’లో ఇంకా చూడొచ్చు. నటుడిగా ఆయనకు ఇది చాలెంజింగ్ సినిమా. మనం నిజ జీవితంలో నటిస్తుంటాం. కానీ, ఆయన నటించరు.. ఇప్పుడు నటించాల్సి ఉంటుంది’’ అన్నారు. ‘‘కోబ్రా’ చిత్రాన్ని నిర్మించే అవకాశమిచ్చిన వర్మగారికి థ్యాంక్స్. ఏడాదిలో 8 నుంచి 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు మా బ్యానర్‌లో వర్మగారితో తీస్తాం. మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్‌ని తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్నాం’’ అన్నారు డి.పి.ఆర్.