
రాజా అంటూ పలకరించేవారు: చిరు
దివంగత నిర్మాత రామానాయుడితో తన అనుబంధాన్ని రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి మీడియాతో పంచుకున్నారు. తనను ఆయన 'రాజా' అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవారని చెప్పారు. చిరంజీవి ఇంకా ఏమన్నారంటే..
''రామానాయుడు ఎప్పుడూ సినిమాయే తన ప్రపంచమని అనేవారు. సినిమాయే ఆయన జీవితం. సినిమాలు తీయడం మానేయాలని తన తండ్రికి చెప్పాలని సురేష్ ఎప్పుడూ అనేవారు. కానీ అదే విషయాన్ని ఆయన వద్ద నేను ప్రస్తావిస్తే, ''రాజా, సినిమాలు తీయడం నేను మానేస్తే నా జీవితం ఆగిపోయినట్లుంటుంది. చివరి క్షణం వరకు సినిమాలు తీస్తూనే ఉండాలి'' అన్నారు. అన్ని భాషల్లోనూ సినిమాలు తీయడం రేర్ ఫీట్. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్క రామానాయుడికే సాధ్యమైంది. అలాంటి రామానాయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అని చిరంజీవి చెప్పారు.