
దర్శకుడు రామనారాయణన్ ఇక లేరు
తమిళం, తెలుగుతో పాటు అనేక భాషల్లో సినిమాలు తీసిన శతాధిక చిత్ర దర్శకుడు రామనారాయణన్ (66) ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో సింగపూర్‌లో కన్నుమూశారు. గత కొంత కాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారాయన. గత ఏడాది సింగపూర్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్ళీ మూత్ర పిండాల సమస్య తలెత్తడంతో సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరి అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందారు. అయితే చికిత్స ఫలించక ఆయన ఆదివారం రాత్రి అక్కడే కన్నుమూశారు. రామనారాయణన్ భార్య రాధ గత ఏడాదే కన్నుమూశారు.
వీరికి కొడుకు మురళి, కూతుళ్ళు అణ్బు, ఉమ ఉన్నారు. దక్షిణాదిన నూటికి పైగా సినిమాలు తీసిన దర్శకుల్లో రామనారాయణన్ ఒకరు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, ఒరియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి భాషల్లో 120 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇన్ని భాషల్లో సినిమాలు తీసిన ఏకైక దక్షిణాది దర్శకుడు రామనారాయణన్ ఒక్కరే. ఆయన దర్శకత్వంలో తమిళంలో ఎక్కువ చిత్రాలు వచ్చాయి. ‘నాగదేవత, లక్ష్మీదుర్గ, శ్రావణ శుక్రవారం, నాగమ్మ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యారు. ఆయన చివరిగా తెలుగులో రూపొందించిన చిత్రం ‘కారా మజాకా’. ఆయన పార్థివ శరీరాన్ని సోమవారం రాత్రి చెన్నైకి తెచ్చారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి.