
‘2.0’లో రమ్యకృష్ణ?
రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా ‘నరసింహ’. ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘మీకెలాంటి పాత్రలు చేయాలని ఉంది?’ అని నేటి తరం నాయికలను అడిగితే, వాళ్లు చెప్పే పేర్లలో నీలాంబరి పాత్ర తప్పకుండా ఉంటుంది. ఈ పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా చేశారని రజనీ సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
ఈ సినిమా వచ్చి దాదాపు పదిహేడేళ్లవుతోంది. ఇన్నేళ్లల్లో మళ్లీ రజనీ-రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇప్పుడా అవకాశం ఉందని సమాచారం. ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో ‘2.0’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్నారు.
ఇందులో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారని బోగట్టా. త్వరలో రజనీ-రమ్యకృష్ణ పాల్గొనగా సన్నివేశాలను చిత్రీరించనున్నారని చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. నీలాంబరి తరహాలోనే ఈ చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట.