
ఆ ఊహ నిజం అవుతుందా!
ఊహకు బలం అధికం. దానికి సరిగా పదును పెడితే అంతరాల్లోకి దిగుతుంది. అలా ఊహాజనిత కథలతో తెరకెక్కిన కథలెన్నో చిత్రాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఒక మహానటిగా, మహోన్నత రాజకీయనాయకురాలిగా తమిళ ప్రజల గుండె అనే ఆలయంలో ఒక దేవతగా, అమ్మగా కొలువైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం సముద్రపు అలల ఆటుపోటుల వంటిదని చెప్పవచ్చు. అయితే జయలలిత సాధన మాత్రం అనితర సాధ్యం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, దృఢమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని పోరాటం అమ్మ నైజాల్లో ప్రధానమైనవి. మరణించినా జీవించి ఉండే అతి కొద్ది మందిలో జయలలిత ఒకరు. అలాంటి అమ్మ రూపంలో మేటి నటి రమ్యకృష్ణ దర్శనం ఇవ్వడం విశేషం.
ఇదేమిటీ జయలలిత రూపంలో రమ్యకృష్ణ దర్శనం ఇవ్వడం ఏమిటీ? అని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతానికి అది ఒక చిత్ర కారుడి ఊహా చిత్రమే. మదర్ ది స్టోరీ ఆఫ్ ఏ క్వీన్ టాగ్‌తో రూపొందించిన అమ్మగా రమ్యకృష్ణ ఊహాజనిత చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి అమ్మ జయలలిత జీవిత చరిత్రను వెండి తెరకెక్కించాలన్న ఆసక్తి, ఆలోచన పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి ఉంది. అలాగే అమ్మగా నటించాలన్న ఆకాంక్ష అగ్రనాయికలైన పలువురిలో ఉంది. అయితే అమ్మ పాత్ర పోషించడం సాధ్యమా?అన్న భయం కొందరిలో లేకపోలేదు.
ఇక జయలలిత రూపంలో నటి రమ్యకృష్ణ ఊహా చిత్రం సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తున్న విషయం గురించి ఆ గ్రేట్ నటి ముందుంచగా చాలా ఎమోషనల్‌గా స్పందించారు. ఆ ఊహా చిత్రం తన దృష్టికీ వచ్చిందన్నారు. తన స్నేహితులు ఆ ఫొటోను వాట్సాప్ ద్వారా తనకు పంపించారన్నారు. అది పూర్తిగా అభిమానుల ఆకాంక్షా చిత్రంగా పేర్కొన్నారు. అయితే ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావించదలచుకున్నానన్నారు. తనను చాలా సార్లు, చాలామంది పత్రికా విలేకరులు మీ డ్రీమ్ రోల్ ఏమిటని అడిగినా అందుకు సమాధానం ఇవ్వలేదన్నారు.
అయితే ఇప్పుడు ఆ ఊహా చిత్రం చూసిన తరువాత జయలలితగా నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇదే తన డ్రీమ్ రోల్ అని పేర్కొన్నారు. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నానని, అయితే ఆ పాత్రలో జీవించడం చాలా చాలెంజ్‌తో కూ డుకుందని అన్నారు. అందువల్ల అలాంటి పాత్రను అంత సులభంగా అంగీకరించలేనన్నారు. స్క్రిప్ట్ పక్కాగా ఉండి, సమర్థులైన దర్శక నిర్మాతలు చిత్ర నిర్మాణానికి పూనుకుని తనను సంప్రదిస్తే తాను అమ్మగా నటించడానికి సిద్ధం అని రమ్యకృష్ణ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం. తనతో పాటు కోట్లాది మంది మహిళామణులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన బోల్డ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ లేడీ అమ్మ అని రమ్యకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అభిమాని ఊహాచిత్రం వెండితెరపై నిజం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శశికళ పేరుతో చిత్రాన్ని రూపొందించడానికి సన్నద్ధం అవుతున్నారు. అందులో అమ్మ పాత్ర ప్రధానంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నిజ వ్యక్తుల రూపాలను వెండితెరపై అచ్చు గుద్దినట్లు చూపించగల వర్మ శశికళ చిత్రంలో ఎవరిని ఆ విధంగా మార్చనున్నారో వెయిట్ అండ్ సీ.