ఉద్వేగానికి గురైన శివగామి
హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాలో శివగామి దేవి పాత్రలో రమ్యకృష్ణ సత్తాచాటింది. ఈ సినిమాలో ప్రభాస్, రానా, సత్యరాజ్‌లతో పాటు రమ్యకృష్ణ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. రమ్యకృష్ణకు ఫోన్ కాల్స్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తున్నాయి. బాహుబలి 2లో తన పాత్రకు వస్తున్న స్పందన, ప్రశంసలు చూసి ఆమె ఉద్వేగానికి గురైంది. తనకు అభినందనలు తెలిపినవారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
'అభిమానులకు ధన్యవాదాలు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసి అభినందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలు, మద్దతు వల్లే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నా. లేకుంటే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నాకు చాలా సంతోషంగా, ఉద్వేగంగా ఉంది. జై మహిష్మతి' అంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. ఆమె కెరీర్‌లో పేరు తెచ్చిన పాత్రల్లో బాహుబలిలోని 'శివగామి' ఒకటి. ఈ సినిమాలో రమ్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.