
రానా నేవీ ఆఫీసర్‌గా... ఘాజి
దేశంలోనే తొలిసారిగా సబ్‌మెరైన్ చిత్రం షురూ!
యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రాలు తీయడం అంటే ఆషామాషీ విషయం కాదు. నిర్మాణ వ్యయం భారీగా ఉంటుంది. పనిదినాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే, ఆ సినిమాకి తెరవెనక పనిచేసేవాళ్లు, తెరపై కనిపించేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే, వార్ మూవీస్ జోలికి వెళ్లడానికి అంత త్వరగా ముందుకు రారు. ఈ తరంలో ఇటీవల రాజమౌళి చేసిన ‘బాహుబలి’, గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’, క్రిష్ రూపొందించిన ‘కంచె’ చిత్రాలు యుద్ధ నేపథ్యంలో సినిమాలు సాధ్యమేనని నిరూపించాయి. అవన్నీ ఒక ఎత్తయితే గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైన ‘ఘాజి’ మరో ఎత్తు అవుతుంది.
ఎందుకంటే, ఇది నీటిలో జరిగే యుద్ధం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. ‘‘ఈ కాన్సెప్ట్ వినగానే ఎంత బడ్జెట్ అయినా సరే తీయాలనుకున్నాను. ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌కే ఏడాది తీసుకున్నాం. చిత్రీకరణను మాత్రం ఆరు నెలల్లోనే పూర్తి చేస్తాం’’ అని పొట్లూరి వి. ప్రసాద్ తెలిపారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అప్పట్లో పాకిస్తాన్ ఉపయోగించిన సబ్‌మెరైన్ పీఎన్‌ఎస్ ఘాజి. ఆ యుద్ధ సమయంలో విశాఖపట్నం దగ్గర బంగాళాఖాతంలో భారత్ తన ప్రత్యర్థి దేశానికి చెందిన ఈ జలాంతర్గామిని జలసమాధి చేసింది.
ఈ నేపథ్యంలో నడిచే కథలో రానా నేవీ ఆఫీసర్‌గా చేస్తున్నారు. యుద్ధం సందర్భంగా తన బృందంతో పాటు 18 రోజులు నీటిలోనే ఉండిపోయిన నేవీ ఆఫీసర్ చుట్టూ కథ తిరుగుతుంది. ‘‘మెయిన్ స్ట్రీమ్ సినిమాపరంగా నా ప్రయోగాన్ని ‘ఘాజి’తో కొనసాగి స్తున్నా. హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది భారత్‌లో వస్తున్న తొలి సబ్‌మెరైన్ మూవీ కావడం విశేషం’’ అని రానా పేర్కొన్నారు. నూతన దర్శకుడు సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరా: మది, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్.